CM Revanth Reddy: వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులకు సీఎం వార్నింగ్
ABN, Publish Date - Jul 21 , 2025 | 07:19 PM
జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎదురువుతున్న సమస్యలపై వారితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, జులై 21: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలని వారికి సూచించారు. ఇవాళ (సోమవారం) హైదరాబాద్‌లోని సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం నమోదు అయ్యిందని.. ఇది తక్కువ వర్షపాతమని సీఎం పేర్కొన్నారు. అయితే గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని.. అన్ని విభాగాలను అప్రమత్తం చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 150 బృందాలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సమన్వయం చేసుకుని ముందుగానే బృందాలను పంపిస్తున్నామని చెప్పారు.
పోలీస్ కమిషనరేట్లల్లోని ఉన్నతాధికారులు గ్రౌండ్ స్థాయిలో ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా జరిగే నష్టాల వివరాలు నమోదు చేయాలని వారికి వివరించారు. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం సైతం అప్రమత్తంగా ఉండాలని హుకుం జారీ చేశారు. ఆ క్రమంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
ప్రతి రోజూ జిల్లా కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందించాలని సీఎస్ రామకృష్ణారావుని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని.. సాగునీటికి సంబంధించి వాటర్ మేనేజ్‌మెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 2.85 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేయడం ద్వారా దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. యూరియా స్టాక్‌కు సంబంధించి ప్రతీ ఎరువుల దుకాణం వద్ద స్టాక్ వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. స్టాక్ డిటైల్స్ ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల కొరత ఉన్నట్లు కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కావాల్సినంత యూరియా స్టాక్ ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. రైతుల కంటే ఏదీ ముఖ్యం కాదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.
ఎరువుల ఫిర్యాదులకు సంబంధించి ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను సీఎం రేవత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 96,95,299 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. గతంలో రేషన్ షాపులపై ఆసక్తి ఉండేది కాదని.. సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందన్నారు. అంతేకాదు రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగిందన్నారు. జులై 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరపాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇన్‌ఛార్జ్ మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు కో-ఆర్డినేట్ చేసుకోవాలని.. అలాగే ప్రతీ మండలంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీ వర్షం.. భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్
బెట్టింగ్ యాప్ కేసులో సినీ సెలబ్రిటీలకు బిగ్ షాక్
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 21 , 2025 | 07:47 PM