త్వరలో హౌసింగ్ బోర్డు స్థలాల అమ్మకం
ABN, Publish Date - Jun 15 , 2025 | 05:37 AM
హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాలు, ప్లాట్ల వేలానికి రంగం సిద్ధమైంది. ఇటీవలే రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్లాట్ల వేలం చేపట్టగా రికార్డు స్థాయిలో ధర పలికింది.
చింతల్, గచ్చిబౌలి, నిజాంపేటలో అమ్మకానికి 22 స్థలాలు.. ఈ నెల 23న బహిరంగ వేలం
హైదరాబాద్ సిటీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాలు, ప్లాట్ల వేలానికి రంగం సిద్ధమైంది. ఇటీవలే రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్లాట్ల వేలం చేపట్టగా రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇదే జోష్‌లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో గల రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు చెందిన స్థలాలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గచ్చిబౌలి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బాచుపల్లి మండలం నిజాంపేట, కుత్బుల్లాపూర్ మండలం చింతల్‌లోని స్థలాలను విక్రయించాలని నిర్ణయించారు. ఈ నెల 23న బహిరంగ వేలం ద్వారా మొత్తం 22 స్థలాలను విక్రయించనున్నారు. రెండు రోజుల క్రితం కూకట్ పల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్-7లో ఖాళీగా ఉన్న 18 స్థలాలను విక్రయించగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓ ప్లాట్ చదరపు గజం ధర అత్యధికంగా రూ.2.98 లక్షలు పలకడం గమనార్హం. అన్నీ ప్లాట్లు కలిపి సగటున చదరపు గజానికి రూ.2.38 లక్షలు పలకడం విశేషం.
చింతల్, గచ్చిబౌలి నిజాంపేటలో 22 స్థలాలు
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని స్థలాల విక్రయానికి భారీ స్పందన రాగా.. అదే దూకుడుతో పలు ప్రాంతాల్లో 22 స్థలాలను విక్రయించాలని నిర్ణయించారు. కుత్బుల్లాపూర్ మండలం చింతల్‌లో 266 చదరపు గజాలున్న 9 ప్లాట్లను విక్రయానికి పెట్టారు. ఈ స్థలాలను కొనాలనుకునేవారు రూ.5 ల క్షల ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే 3,388 చదరపు గజాల పాఠశాలను కూడా విక్రయానికి పెట్టగా.. కొనాలనుకునేవారు రూ.10 లక్షల ధరావ త్తు చెల్లించాలి. చింతల్‌లోని ఈ ప్లాట్లకు చదరపు గజం అప్‌సెట్ ధరను హౌసింగ్ బోర్డు అధికారులే రూ.80 వేలుగా నిర్ణయించడం విశేషం.
గచ్చిబౌలిలో నాలుగు స్థలాలను విక్రయానికి పెట్టగా.. అందులో 1,206 చదరపు గజాల పాఠ శాల స్థలానికి చదరపు గజానికి అప్‌సెట్ ధర రూ.80 వేలు నిర్ణయించగా.. 1,487 చదరపు గజాల కమర్షియల్ స్థలానికి అప్‌సెట్ ధరను రూ.1.20 లక్షలుగా నిర్ణయించారు. ఆయా ప్లాట్ల ను కొనాలనుకునేవారు రూ.10 లక్షల ధరావత్తు చెల్లించాలి. 315, 263 చదరపు గజాలు కలిగిన రెండు ప్లాట్లకు చదరపు గజం అప్‌సెట్ ధరను రూ.50వేలు నిర్ణయించగా.. కొనుగోలు చేయా లనుకునేవారు 5 లక్షల ధరావత్తు చెల్లించాలి.
బాచుపల్లి మండలం నిజాంపేటలో 413 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను అమ్మకానికి పెట్టగా.. ఆయా ప్లాట్లను కొనాలనుకునేవారు రూ.2లక్షల ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాట్లను కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్న వారు వేలం జరిగే 23వ తేదీన ఉదయం 11 గంటల్లోపు డీడీ రూపంలో ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాట్ల వేలాన్ని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోని హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్ ఫేజ్-1, ఫేజ్-2లలో నిర్వహించనున్నారు.
Updated Date - Jun 15 , 2025 | 05:37 AM