Hyderabad: డబుల్ డెక్కర్‌కు మెట్రో రెడ్‌సిగ్నల్..
ABN, Publish Date - Apr 30 , 2025 | 10:35 AM
హైదరాబాద్ మహానగరంలో నిర్మించతలపెట్టిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ దాదాపు ఆగిపోయినట్లేనని తెలుస్తోంది. కేవలం.. హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) తిరకాసు పెట్టడంతో ఈ ప్రాజెక్టు పక్కకు పోయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- ఉమ్మడిగా నిర్మాణానికి నిరాకరణ సొంతంగా చేపట్టడానికే ఆసక్తి..
- యథాతథంగా ఎలివేటెడ్ కారిడార్‌లే
- హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు బుట్టదాఖలు..
- ఒకే మార్గంలో వేర్వేరు ప్రాజెక్టులతో ఇబ్బందులు
- భూసేకరణతో పాటు పెరగనున్న నిర్మాణ వ్యయం
హైదరాబాద్ సిటీ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ తరహాలో హైదరాబాద్‌లో నిర్మించాలని భావించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ (రోడ్డు మార్గం, ఆపైన ఫ్లైఓవర్, ఆపైన మెట్రోకారిడార్) నిర్మాణం దాదాపు ఆగిపోయినట్లే. హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) తిరకాసు పెట్టడంతో ఈ ప్రాజెక్టు పక్కకు పోయింది. మెట్రోలైన్‌ను తాము సొంతంగా నిర్మించుకుంటామని స్పష్టం చేసింది. దీంతో హెచ్‌ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్, మెట్రో కారిడార్లను ఎవరికి వారు నిర్మించుకోనున్నారు. వేర్వేరు ప్రాజెక్టుల వల్ల ఆ మార్గంలో భూ సేకరణ, సర్వీసు రోడ్డు విస్తరణ సమస్యలతో పాటు నిర్మాణ వ్యయం భారీగా పెరగనుంది.
ఈ వార్తను కూడా చదవండి: Special trains: చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు
నాలుగు నెలల క్రితం..
నార్త్ సిటీ మెట్రో నేపథ్యంలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విధితమే. కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు ఇప్పటికే నిర్ణయించిన ఎలివేటెడ్ కారిడార్లను డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లుగా మార్చాలని సూచించడంతో ఆ మేరకు డిజైన్లను హెచ్‌ఎండీఏ రూపొందించింది. 18.100 కిలోమీటర్ల మేర శామీర్‌పేట మార్గంలో ఆరులైన్లలో ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో 12.1 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్, కండ్లకోయ మార్గం (5.320 కిలోమీటర్ల) ఎలివేటెడ్ కారిడార్‌లో సుమారు 4 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఎలివేటెడ్ కారిడార్లకు రూ.3,812 కోట్ల వరకు వ్యయం కానుండగా, డబుల్ డెక్కర్ నిర్మాణానికి మరో 40శాతం వ్యయమని అంచనా వేశారు.
డబుల్ డెక్కర్ నిర్మాణ ప్రతిపాదన ఇలా..
రోడ్డు మార్గం, ఆపైన ఫ్లైఓవర్, ఆపైన మెట్రో కారిడార్ నిర్మించేలా డబుల్ డెక్కర్ ప్రతిపాదనలు రూపొందించారు. రోడ్డు (పునాది) నుంచి పిల్లర్లను మెట్రోకు కనెక్ట్ చేసేలా హెచ్‌ఎండీఏ డిజైన్ చేసింది. ఆరు లేన్లతో ఫ్లైఓవర్‌ను హెచ్‌ఎండీఏ నిర్మించనుండగా, ఫ్లైఓవర్‌పై పిల్లర్‌ను కొంత మేరకు పెంచి దానిపై మెట్రో నిర్మాణం హెచ్‌ఎంఆర్‌ఎల్ చేపట్టాలని భావించారు. అయితే హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు ఇటీవల డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. తాము ప్రత్యేకంగా నిర్మించుకుంటామని ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిసింది. దీంతో పాత డిజైన్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
భవిష్యత్‌లో ఇబ్బందులు
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నాగ్‌పూర్‌లో 5.6 కిలోమీటర్ల మేర నిర్మించింది. ఆసియాలో అతి పొడవైనదిగా నిలిచింది. పూణేలో కూడా 1.6 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీనివల్ల భూసేకరణ, నిర్మాణ వ్యయం తగ్గుతాయని, స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు తీరుతాయని మహారాష్ట్ర సర్కార్ భావిస్తోంది. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు తీరేందుకు, మెరుగైన ప్రజారవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి హెచ్‌ఎంఆర్‌ఎల్ అడ్డుకట్ట వేయడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎలివేటెడ్ కారిడార్ 60 మీటర్లతో రానుండగా, ఆ పక్కన మెట్రో పిల్లర్లు రానున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో సర్వీసు రోడ్డు విస్తరణకు అడ్డంకులు ఏర్పడనున్నాయి. ప్రాజెక్టుల వ్యయం రెండింతలకు పైగా పెరగనుంది.
వార్తలు కూడా చదవండి
Cyber Fraud: నయా సైబర్ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి
మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై కట్టడి
NHAI: ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!
Read Latest Telangana News and National News
Updated Date - Apr 30 , 2025 | 10:35 AM