Cyber Fraud: నయా సైబర్ మోసం ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:13 AM
సైబర్ నేరగాళ్లు ఆర్మీ ఆధునికీకరణ, పీఎం కేర్స్ పేరుతో ఫేక్ లింకుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. నెటిజన్లు మోసపోవద్దని, లింకులను షేర్ చేయవద్దని సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత హెచ్చరించారు
పీఎం కేర్స్ పేరుతో లింకులు.. అదంతా ఫేక్ అంటున్న అధికారులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను సైబర్ కేటుగాళ్లు అనుకూలంగా మార్చుకుంటూ.. ‘సైన్యం ఆధునికీకరణకు విరాళాలివ్వండి’ అంటూ వాట్సాప్, టెలిగ్రామ్‌తోపాటు.. పలు సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపుతున్నారు. అది నిజమేనని నమ్మి నెటిజన్లు విరాళాలు ఇస్తున్నారు. అయితే.. అదంతా ఫేక్ అని, మోసపోవొద్దని ఆర్మీ అధికారులు. సైబర్ నేరగాళ్లు విరాళాల సేకరణకు ‘పీఎం కేర్స్’ పేరును వాడుకుంటున్నారు. ‘‘దేశం కోసం ప్రాణాలర్పించే సైన్యాన్ని బలోపేతం చేయడానికి విరాళాలివ్వండి..’’.. ‘‘సైనికుల పట్ల దేశభక్తిని చాటుకోండి..’’.. ‘‘సైనికుల కోసం రోజుకు ఒక రూపాయి ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుతున్నారు..’’.. అంటూ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఫొటోలతో ప్రచారం చేస్తున్నారు. ఇదంతా మోసమని తెలియని నెటిజన్లు.. ఆ లింకులను బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు. తాము విరాళమిచ్చామని పేర్కొంటూ స్ర్కీన్‌షాట్లను షేర్ చేస్తున్నారని సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత దార పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని నెటిజన్లకు సూచించారు.