High Court: గుడ్ల సరఫరా టెండర్లను ఖరారు చేయండి
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:06 AM
టెండర్లు దాఖలు చేసిన బిడ్డర్ల కోసం కాకపోయినా ఆరోగ్యలక్ష్మి, ఇతర ప్రభుత్వ పోషకాహార పథకాల లబ్ధిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా కోడిగుడ్ల సరఫరా టెండర్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): టెండర్లు దాఖలు చేసిన బిడ్డర్ల కోసం కాకపోయినా ఆరోగ్యలక్ష్మి, ఇతర ప్రభుత్వ పోషకాహార పథకాల లబ్ధిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా కోడిగుడ్ల సరఫరా టెండర్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మార్చి 30న టెండర్ నోటిఫికేషన్ జారీచేసి ఇప్పటివరకు ఖరారు చేయలేదని పేర్కొంటూ సిరి ఫామ్స్ అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కారణాలు చెప్పకుండా చివరి గడువు తేదీ పొడిగిస్తూ పోవడం వల్ల ధరావతు సొమ్ము, ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో భారం పడుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు రాజా శ్రీపతిరావు, ఏ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.
అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గుడ్ల నాణ్యతా ప్రమాణాలు, సేకరణ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం వివిధ స్థాయిల్లో విధాన నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పరిపాలనాపరమైన కారణాల వల్ల జరిగే ఆలస్యానికి ఎలాంటి దురుద్దేశాలు ఆపాదించలేమని.. వాయిదాలను ప్రశ్నించే హక్కు పిటిషనర్‌కు లేదని ప్రకటించింది. బిడ్డర్లు సైతం ధరావతు సొమ్ము కింద కోసం భారీ ఎత్తున పెట్టుబడి పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపింది. అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
Updated Date - Jun 20 , 2025 | 05:06 AM