ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: రైతు భరోసాలో కోతలు, వడపోతలు

ABN, Publish Date - Jan 02 , 2025 | 04:58 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసాలో కోతలు, వడపోతలు తప్ప ప్రత్యేకత ఏమీ లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

  • ఇందుకోసమే ఏడాది కాలంగా జాప్యం

  • మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయించే ప్రయత్నం

  • ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోం

  • రెడ్‌జోన్‌కు సమీపంలో తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ

  • సీఎం రేవంత్‌రెడ్డే ఇందుకు కారణం: హరీశ్‌

సంగారెడ్డి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసాలో కోతలు, వడపోతలు తప్ప ప్రత్యేకత ఏమీ లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. వ్యవసాయానికి ఇచ్చే పెట్టుబడి సాయంలో అనేక రకాలుగా కోతలు పెట్టడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఏడాది కాలంగా కసరత్తు చేస్తున్నారని అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతుబంధు కింద 11 విడతల్లో రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. గడిచిన వానాకాలం, ప్రస్తుత యాసంగికి సంబంధించి ఎకరాకు రూ.15 వేలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసాకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు చేసేలా ప్రయత్నాలు ఆరంభించారని, మరింత జాప్యం చేయడానికే ఈ ఎత్తుగడ అని ఆరోపించారు. రాళ్లు, రప్పలున్న భూములకు రైతు భరోసా డబ్బులు ఇవ్వబోమని అంటే దళిత, గిరిజన రైతులు సాగుచేసే పోడు, ఇతర భూముల్లో రాళ్లు, రప్పలు ఉండవా? అని ప్రశ్నించారు.


బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు రూ.వేల కోట్లు మాఫీ చేసి.. రైతులకు మాత్రం పెట్టుబడి సాయంలో కోతలు విధించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇక ఎకరం లోపు ఉన్న వారందరినీ వ్యవసాయ కూలీలుగానే పరిగణించి ఏటా రూ.12 వేల చొప్పున నగదు ఇవ్వాలని అన్నారు. రూ.2 లక్షల పైబడిన రుణం ఉన్న రైతులకు మాఫీ ఎప్పుడు చేస్తారో తేదీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రీన్‌జోన్‌లో ఉన్న తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ పనితీరు ప్రస్తుతం ఎల్లోజోన్‌లో ఉందని, రెడ్‌జోన్‌కు చేరువైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ర్టానికి పెట్టుబడులు రావాలంటే నేషనల్‌ క్రైం బ్యూరోలోని రికార్డులను పరిశీలిస్తారని, కానీ.. గత ఏడాది కాలంలో నేరాల శాతం విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. డయల్‌-100కు కాల్‌చేస్తే ఆలస్యంగా స్పందిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ పోలీసులు ఇలా కావడానికి సీఎం రేవంత్‌రెడ్డే కారణమని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, మాణిక్‌రావు, బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 04:58 AM