Bollaram: వైద్యం వికటించి జిమ్ ట్రైనర్ మృతి
ABN, Publish Date - Jun 17 , 2025 | 05:52 AM
గ్యాస్ట్రిక్ సమస్యకు ఆర్‌ఎంపీ వైద్యుడు చేసిన చికిత్స వికటించి ఓ జిమ్ ట్రైనర్ మృతి చెందాడు. ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది.
ఆర్‌ఎంపీ క్లినిక్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
బొల్లారం రిసాలబజార్‌లో ఘటన
తిరుమలగిరి జూన్ 16 (ఆంధ్రజ్యోతి): గ్యాస్ట్రిక్ సమస్యకు ఆర్‌ఎంపీ వైద్యుడు చేసిన చికిత్స వికటించి ఓ జిమ్ ట్రైనర్ మృతి చెందాడు. ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. బొల్లారం రిసాల బజార్‌కు చెందిన జ్ఞానేశ్వర్ కుమార్ (22) జిమ్ ట్రైనర్. అయితే, ఆదివారం రాత్రి బిర్యాని తిన్న అనంతరం జ్ఞానేశ్వర్‌కు గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తింది. దీంతో స్థ్ధానిక ఆర్‌ఎంపీ వైద్యుడు వంశీ నిర్వహించే క్లినిక్‌కు వెళ్లాడు. వైద్యుడు ఇంజక్షన్ ఇవ్వడంతో ఇంటికి వచ్చిన జ్ఞానేశ్వర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించగా వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
దాంతో బంధువులు అల్వాల్ రైతుబజార్ సమీపంలోని ఓజోన్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వైద్యుడి క్లినిక్‌పై దాడి చేశారు. వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ మూలంగానే అతను మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బొల్లారం పోలీసులు.. వంశీని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, గతంలో భవాని క్లినిక్ పేరుతో ఉన్న ఇదే ఆర్‌ఎంపీ.. ఓ క్లినిక్‌ను నిర్వహించగా మేడ్చల్ డీఎంహెచ్‌ఓ అధికారులు సీజ్ చేశారు. అయితే, ఇటీవలే ఈ క్లినిక్‌ను మళ్లీ తెరిచారు.
Updated Date - Jun 17 , 2025 | 05:52 AM