Gurukula Schools: గురుకులాల గోడు
ABN, Publish Date - Jun 30 , 2025 | 02:52 AM
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది, అద్దె బకాయిలు, సరఫరాదారుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమే ఇందుకు కారణం............
జనవరి నుంచి నిలిచిపోయిన బిల్లులు
పలుచోట్ల గుడ్లు, చికెన్, అరటిపండ్ల సరఫరా బంద్
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అద్దె బకాయిలు, సరఫరాదారుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమే ఇందుకు కారణం. దీంతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. కేంద్రీకృత సేకరణ విధానం అమలులో జాప్యం వల్ల ఈ విద్యా సంవత్సరం కూడా పాత కాంట్రాక్టర్లనే కొనసాగిస్తున్నారు. వారికి కూడా జనవరి నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో.. ఇప్పటికే కొన్ని చోట్ల కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయింది. సర్కారు తమకు బిల్లు బకాయిలు చెల్లించకుంటే.. మంగళవారం (జూలై 1వ తేదీ) నుంచి అన్ని రకాల ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు.. చిలుకూరు ఎస్సీ గురుకుల పాఠశాలకు గుడ్లు, మాంసం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు రూ.10 లక్షల బకాయిలు ఉండటంతో సరఫరా నిలిపివేశారు. తాను ఇప్పటికే ఇంట్లో ఉన్న నగలు తాకట్టుపెట్టాల్సి వచ్చిందని.. ప్రభుత్వం బకాయిలు చెల్లించేవరకూ సరఫరా చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఇలాగే పలువురు కాంట్రాక్టర్లు చాలా చోట్ల ఆపేశారు. ఈ పరిస్థితుల్లో సంక్షేమ శాఖల కార్యదర్శులు ఏమి చేయాలో తెలియక నిస్తేజంగా ఉండిపోయారు. జిల్లాల్లో అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు.. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మెనూలో కీలకపదార్థాల సరఫరాను చాలా చోట్ల నిలిపివేయడంతో.. విద్యార్థులకు రోజువారీ మెనూ ప్రకారం ఆహారం అందించడం కష్టంగా మారింది. దీంతో ప్రిన్సిపాళ్లు కాంట్రాక్టర్లను బతిమాలుకుంటూ ఏరోజు కారోజు నెట్టుకొస్తున్నారు.
అద్దె బకాయిలు..
రాష్ట్రంలో దాదాపు 1023 గురుకుల పాఠశాలలు, కళాశాలలు వివిధ సంక్షేమ శాఖల పరిధిలో పనిచేస్తున్నాయి. వీటిలో 662 విద్యా సంస్థలు అద్దెభవనాల్లో కొనసాగుతుండగా.. వీటికి 13 నెలలుగా రూ.450 కోట్లకుపైగా అద్దె బకాయిలున్నాయి. ఆయా భవనాల యజమానులు తాళాలు వేస్తామని బెదిరించడంతో పాఠశాలల ప్రారంభానికి ఒక్క రోజు ముందు సర్కారు మూడు నెలల అద్దె చెల్లించింది. అలాగే.. విద్యాసంవత్సరం ప్రారంభమై చాలారోజులైనా, కాంట్రాక్టర్లను నియమించకపోవడంతో పిల్లలకు యూనిఫారాలు, టైలు, బెల్టులు, బూట్లు, స్కూల్ బ్యాగులు ఇంతవరకూ అందలేదు. ఎస్టీ గురుకులాల్లో గత ఏడాది ఇచ్చిన యూనిఫారాలతోనే విద్యార్థులు నెట్టుకొస్తున్నారు. ఎస్సీ గురుకులాల్లో అయితే మూడేళ్లుగా విద్యార్థులకు యూనిఫామ్స్ అందించలేదు.
బీసీ, మైనారిటీ గురుకులాల్లో పరిస్థితీ దాదాపుగా అదే. నిజానికి ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ విధానం అమలైతేనే.. కామన్ డైట్ ద్వారా అన్ని వస్తువులనూ పూర్తిస్థాయిలో సమర్థంగా అందించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆలోచన. కానీ, దీనిపై తుదినిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. సర్కారు త్వరగా నిర్ణయం తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Jun 30 , 2025 | 02:52 AM