Vedire Sreeram: సముద్రం పక్కనే ఉన్నామని.. నీళ్లన్నీ మావే అంటే కుదరదు
ABN, Publish Date - Jul 16 , 2025 | 04:10 AM
సముద్రం పక్కనే ఉన్నామని.. అందులోకి పోయే నీళ్లన్నీ తమవేనని ఎవరైనా అంటే కుదరదని కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ అన్నారు.
ఏ రాష్ట్రానికైనా దేశంలో అమల్లో ఉన్న చట్టాలే వర్తిస్తాయి.. ఏడు రాష్ట్రాలు అంగీకరిస్తేనే గోదావరిపై ట్రైబ్యునల్
కాళేశ్వరం, బనకచర్లకు ప్రత్యామ్నాయంగా ఇచ్చంపల్లి
100 మీటర్ల ఎత్తుతో రిజర్వాయర్ కడితే బ్యాక్‌వాటర్‌ను.. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి పంపింగ్ చేసుకోవచ్చు
జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ వెల్లడి
హైదరాబాద్, జూలై15 (ఆంధ్రజ్యోతి): సముద్రం పక్కనే ఉన్నామని.. అందులోకి పోయే నీళ్లన్నీ తమవేనని ఎవరైనా అంటే కుదరదని కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ అన్నారు. ఏ రాష్ట్రానికైనా దేశంలో అమల్లో ఉన్న చట్టాలే వర్తిస్తాయని స్పష్టం చేశారు. గోదావరి జలాల పంపిణీ కోసం ట్రైబ్యునల్ వేయడం అంత సులభం కాదని, ఆ నీటిని పంచుకునే రాష్ట్రాలన్నీ అంగీకరిస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో ‘గోదావరి జలాల వివాదం-వాస్తవాల పరిశీలన’ అనే అంశంపై తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కప్పెర ప్రసాద్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో వెదిరె శ్రీరామ్ మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల వైఫల్యం నేపథ్యంలో గోదావరి-బనకచర్లకు ప్రత్యామ్నాయంగా ‘గోదావరి-కావేరి అనుసంధానం’ ఉంటుందన్నారు. 100 మీటర్ల ఎత్తుతో ఇచ్చంపల్లి రిజర్వాయర్ నిర్మిస్తే.. బ్యాక్ వాటర్‌ను కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి పంపింగ్ చేసుకోవచ్చని అన్నారు. గోదావరి-కావేరి అనుసంధానానికి అయ్యే వ్యయంలో 90 శాతాన్ని కేంద్రమే భరిస్తుందని, మిగిలిన 10 శాతం వ్యయాన్ని.. ప్రయోజనం పొందే రాష్ట్రాలు వాటి వినియోగం నిష్పత్తి ఆధారంగా భరించాల్సి ఉంటుందని తెలిపారు. రూ.లక్ష కోట్లతో నిర్మించే గోదావరి-బనకచర్లలో ముంపునకు/సేకరించే భూమి 63 వేల ఎకరాలు కాగా, రూ.50 వేల కోట్లతో చేపట్టే గోదావరి-కావేరి అనుసంధానంలో ముంపునకు గురయ్యే భూమి 43 వేల ఎకరాల మాత్రమేనని శ్రీరామ్ పేర్కొన్నారు. పైగా, గోదావరి-కావేరితో తరలించే నీటితో 80 శాతం తెలంగాణ, రాయలసీమకే ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టులో తరలించే నీటితో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేదని,ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని వాటా నుంచే 147 టీఎంసీలను తొలి దశలో తరలించనున్నారని తెలిపారు.
నిల్వ సామర్థ్యం లేని ప్రాజెక్టుల వల్లే ఇబ్బందులు..
తెలంగాణలో శ్రీరాంసాగర్ (పోచంపాడు)ను 135 టీఎంసీలతో చేపట్టగా.. పూడిక వల్ల దాని నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయిందని వెదిరె శ్రీరామ్ అన్నారు. గోదావరిలో ప్రధానంగా నిల్వ సామర్థ్యం లేని ప్రాజెక్టుల వల్లే ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు కూడా ఈ కోవకు చెందినదేనన్నారు. గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టును ప్రభావిత రాష్ట్రాలు అంగీకరిస్తేనే చేపట్టే అవకాశం ఉంటుందని, తెలుగు రాష్ట్రాలు గట్టిగా ప్రయత్నిస్తేనే ఇందుకు సానుకూలత వస్తుందని పేర్కొన్నారు. ఇక తుమ్మిడిహెట్టి నిల్వకు, సామర్థ్యానికి సంబంధం లేదని, 150 మీటర్ల ఎత్తుతో కట్టినా... 165 టీఎంసీల నీటి వినియోగానికి అవకాశం ఉంటుందని శ్రీరామ్ స్పష్టం చేశారు. 148 మీటర్లతో కట్టినా, 150 మీటర్లతో కట్టినా 250 ఎకరాల ప్రైవేట్ భూమి ముంపునకు గురవుతుందని చెప్పారు. దేశఽంలో రెండో అతిపెద్ద నది గోదావరి అని, మహారాష్ట్రతో పోల్చితే గోదావరి జలాల వినియోగంలో తెలంగాణ వెనుకబడిందని అన్నారు. జలాల వినియోగాన్ని నిర్ధారించేది ట్రైబ్యునల్ మాత్రమేనని, గోదావరికి 12 సబ్ బేసిన్లు ఉండగా... దీనిని ఏడు రాష్ట్రాలు పంచుకుంటున్నాయని వివరించారు. ఇక ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద 75 శాతం డిపెండబులిటీ ఆధారంగా 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందని వెదిరె శ్రీరామ్ వెల్లడించారు. 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలు వాడుకునే అవకాశాలున్నాయని చెప్పిందని, ఇదే విషయాన్ని మేడిగడ్డ బ్యారేజీ విషయంలోనూ చెప్పిందని పేర్కొన్నారు. గోదావరిలో 75ు డిపెండబుల్టీ ఆధారంగా 3396.9 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. అందులో ఉమ్మడి ఏపీకి 1499 టీఎంసీల నీటి వినియోగానికి బచావత్ ట్రైబ్యునల్ అంగీకరించిందని తెలిపారు. అందులో 531 టీఎంసీలు ఏపీ, 968 టీఎంసీలు తెలంగాణకు వచ్చాయన్నారు. 1996 నుంచి 2023 దాకా తీసిన లెక్కల ప్రకారం ఏటా 3396 టీఎంసీలో గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నట్లు చెబుతున్నారని, కానీ.. అందులో ఎగువ రాష్ట్రాల నికర జలాలు, ప్రా జెక్టులు కట్టుకున్నా వినియోగించుకోని వాటా (ఛత్తీ స్‌గఢ్ 400 టీఎంసీలు, తెలంగాణ 307 టీఎంసీలు ఇతరత్రా) అంతా తీసేస్తే.. 1138 టీఎంసీలు మాత్ర మే సముద్రంలో కలుస్తున్నాయని వివరించారు.
Updated Date - Jul 16 , 2025 | 04:10 AM