Giacomo: సంక్లిష్టంగా ప్రపంచ రాజకీయాలు
ABN, Publish Date - Apr 27 , 2025 | 03:45 AM
మనకు సమయం తక్కువగా, సవాళ్లు భారీగా ఉన్నాయి. కానీ కలిసి పనిచేస్తే అందరికీ న్యాయం అందించగలం. న్యాయం, గౌరవం, ఐక్యత.. విజయం సాధించేలా కలిసి పనిచేద్దాం అని యూరోపియన్ సోషలిస్టు పార్టీ సెక్రటరీ జనరల్ జొకోమో పిలుపునిచ్చారు.
ఐక్యత, ధైర్యంతోనే అన్యాయాన్ని ఎదుర్కోగలం
యూరోపియన్ సోషలిస్టు పార్టీ నేత జొకోమో
భారత్ సమ్మిట్‌లో ‘నమస్తే’ అంటూ ప్రసంగం ప్రారంభం
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ‘‘మనకు సమయం తక్కువగా, సవాళ్లు భారీగా ఉన్నాయి. కానీ కలిసి పనిచేస్తే అందరికీ న్యాయం అందించగలం. న్యాయం, గౌరవం, ఐక్యత.. విజయం సాధించేలా కలిసి పనిచేద్దాం’’ అని యూరోపియన్ సోషలిస్టు పార్టీ సెక్రటరీ జనరల్ జొకోమో పిలుపునిచ్చారు. భారత్ సమ్మిట్‌కు హాజరైన ఆయన.. ‘నమస్తే’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆయన... ‘అందరం ఒక్కటే’ అనే అంశంపై మాట్లాడారు. జాత్యహంకారం, ఉగ్రవాదం, పర్యావరణ విధ్వంసం, మైనారిటీలపై హింస.. ఇలా అనేక రూపాల్లో అన్యాయం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆయా అంశాల్లో నిజమైన న్యాయం, జవాబుదారీతనం అవసరమన్నారు. ప్రతి సమాజం ఏదో ఒక రూపంలో అన్యాయంతో పోరాడుతుందని, ఐక్యత, ధైర్యంతోనే దాన్ని ఎదుర్కోగలమన్నారు.
ప్రపంచంలోని 140పైగా దేశాలు యుద్ధం, అసమానతలు, అన్యాయాలను ఎదుర్కొనేందుకు గతంలో కట్టుబడ్డాయని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ కట్టుబాట్లను అన్ని దేశాలు అర్థం చేసుకున్నాయా? లేదా? అనే సందేహం కలుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో రాజకీయ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, రాజకీయ నాయకులు ప్రభుత్వ పాలనలో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బందులకు గురిచేస్తాయని అన్నారు. ఇటీవలి కాలంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో రాజకీయ తటస్థత దెబ్బతినడంతో విద్యాసంస్థలు, స్వతంత్ర గొంతుకలు మూగబోతున్నాయన్నారు. సభావేదికపై రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్ మధ్య కూర్చున్న జొకోమో తన ప్రసంగంలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. తన ప్రసంగం అనంతరం.. ఆయన మాట్లాడిన పలు అంశాలపై రాహుల్‌గాంధీతో చర్చించారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 27 , 2025 | 03:45 AM