Nambala Keshava Rao Maoist Rise: సిక్కోలులో పుట్టి.. అంచెలంచెలుగా.. అగ్రస్థానానికి
ABN, Publish Date - May 22 , 2025 | 03:44 AM
శ్రీకాకుళం జిల్లా జీయన్నపేటలో పుట్టిన నంబాల కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో అగ్రనాయకుడిగా ఎదిగారు. అలిపిరి దాడి సహా 27 దాడుల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మిలటరీ వ్యూహాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందారు.
మిలటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తుడు
అలిపిరి సహా 27 దాడుల్లో పాత్ర.. నంబాల ప్రస్థానం
(అమరావతి- ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్):నంబాల కేశవరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీయన్నపేట గ్రామం. వాసుదేవరావు, భారతమ్మ దంపతులకు 1954లో కేశవరావు జన్మించారు. వాసుదేవరావు ఉపాధ్యాయుడు కాగా.. భారతమ్మ గృహిణి. కేశవరావు పెద్దన్నయ్య ఢిల్లీశ్వర్‌రావు, తమ్ముడు రాంప్రసాద్ విశాఖలో ఉంటున్నారు. అక్క ఉష విజయవాడలో, చెల్లెలు జలజాక్షి శేఖరాపురంలో, మరో సోదరి సత్యవతి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కబడ్డీ ఆటగాడిగా పేరున్న కేశవరావు నౌపడా హైస్కూల్‌లో 8-10 తరగతులు చదివారు. టెక్కలి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేశారు. వరంగల్ ఆర్‌ఈసీలో బీటెక్ పూర్తిచేశారు. అప్పటికే రాడికల్ స్కూటెంట్స్ యూనియన్(ఆర్‌ఎ్‌సయూ)లో క్రియాశీలంగా ఉన్న కేశవరావు.. ఎంటెక్ చదువుతున్న సమయంలో(1975) మెస్‌లో జరిగిన ఓ గొడవ(ఒకరు మృతిచెందారు)కుతోడు.. జాతీయ ఎమర్జెన్సీ కారణంగా అజ్ఞాతంలోకి వెళ్లారు. నక్సల్‌బరి ఉద్యమంలో చేరారు. జీయన్నపేటలో తన మిరప పొలం పనులు చూసుకుంటుండగా.. తనకోసం పోలీసులు రావడంతో కొండల్లోకి పారిపోయారు. పోలీసులు అతణ్ని చింతపల్లి అడవుల్లో అరెస్టు చేసి, విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చాక.. పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి 45 ఏళ్లుగా ఇంటిముఖం చూడకుండా, పీపుల్స్‌వార్.. ఆ తర్వాత మావోయిస్టు పార్టీల్లో కీలక భూమిక పోషించారు.
మిలటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తుడు
కేశవరావు తొలుత గంగన్న అనే పేరుతో సీపీఐఎంఎల్ తూర్పుగోదావరి జిల్లా సభ్యుడిగా పనిచేశారు. రాష్ట్రకమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించాక బసవరాజుగా పేర్గాంచారు. క్రమంగా అగ్రనాయకుడిగా మారారు. ఈయన 1987లో బస్తర్ అడవుల్లో శ్రీలంకకు చెందిన ఎల్‌టీటీఈ మిలిటెంట్ల వద్ద ప్రత్యేక శిక్షణ పొందినట్లు సమాచారం. 1992లో సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2000-04 మధ్య కాలంలో పీపుల్స్ వార్ కేంద్ర మిలటరీ కమిషన్(సీఎంసీ) కార్యదర్శిగా కొనసాగారు. 2004లో పీపుల్స్‌వార్, సీపీఐ(ఎంఎల్) తదితర గ్రూపులు సీపీఐ(మావోయిస్టు) పార్టీగా రూపాంతరం చెందాయి. అప్పటి నుంచి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన హయాంలో కేశవరావు మిలటరీ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషిస్తూనే.. 2018 వరకు కేంద్ర మిలటరీ కమిషన్ చీఫ్‌గా పనిచేశారు. వివిధ రాష్ట్రాల్లో సాయుధ పోరాటాన్ని ఉధృతం చేశారు. 16 రాష్ట్రాల్లో రెడ్ కారిడార్‌ను నడిపారు. బలగాలపై మెరుపు దాడులు చేసేవారు. మిలటరీ ఆపరేషన్లలో నంబాల చెప్పిందే వేదంగా పార్టీలో కొనసాగుతుందని సమాచారం. 2018 నవంబరు 10న గణపతి అనారోగ్య కారణాలతో రాజీనామా చేయగా.. కేశవరావు ప్రధాన కార్యదర్శి బాధ్యతలను స్వీకరించారు. పీఎల్‌జీఏ దళాలకు సైతం నంబాల ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు.. హిడ్మా వంటి వాళ్లు ఇతని శిష్యులేనని ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు.
అలిపిరి సహా.. 27 దాడుల్లో కీలక పాత్ర.
నక్సల్ ఉద్యమాన్ని, మావోయిస్టు పార్టీగా మార్చిన తర్వాత.. నంబాల 27 ముఖ్య దాడులు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
2003 అక్టోబరు 1న చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద 17 క్లైమోర్ మైన్స్‌తో జరిగిన దాడిలో ఈయనే ప్రధాన సూత్రధారి.
ఒడిసాలోని కోరాపూట్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఆయుధాగారంపై దాడి చేసి, ట్రక్కుల నిండా తుపాకులను దోచుకుపోయిన ఘటన వెనక ఈయనే ప్రధాన నిందితుడు..
2010లో ఛత్తీస్‌గఢ్ లోని చింతల్నార్ ఘటనలో వ్యూహం కేశవరావుదే. కూంబింగ్‌కు వెళ్లి తిరిగివస్తున్న సీఆఆర్పీఎఫ్ జవాన్లు రెండు కొండల మధ్యకు రాగానే.. మావోయిస్టులు కాపుకాచి, కాల్పులు జరిపేలా వ్యూహరచన చేశారు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. తాడిమెట్లలో 76 మంది జవాన్ల మృతి.
2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్రకర్మతోపాటు మరో 27 మంది మరణించారు.
2018 సెప్టెంబరు 23న అరకులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యకేసులో నంబాల ప్రధాన నిందితుడు.
2021లో బీజాపూర్‌లోని తెర్రం(హిడ్మా స్వస్థలం) అడవుల్లో 22 మంది జవాన్లు, 2020లో సుకుమాలో 17 మంది జవాన్లను హతమార్చిన ఘటనలకు నంబాల సూత్రధారి.
2019లో దంతేవాడలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మండవి, నలుగురు గన్‌మన్ల హత్యలో ఇతనే ప్రధాన నిందితుడు.
Updated Date - May 22 , 2025 | 03:46 AM