COVID-19: తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం
ABN, Publish Date - May 24 , 2025 | 03:24 AM
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోందనే వార్తల నేపథ్యంలో తెలంగాణలో కొవిడ్ కలకలం రేగింది. రాష్ట్రంలో తొలి కొవిడ్ కేసు నమోదైంది.
హైదరాబాద్‌కు చెందిన పల్మనాలజిస్టుకు కొవిడ్ పాజిటివ్.. అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, హైదర్‌నగర్, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోందనే వార్తల నేపథ్యంలో తెలంగాణలో కొవిడ్ కలకలం రేగింది. రాష్ట్రంలో తొలి కొవిడ్ కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన పల్మనాలజిస్టు(శ్వాసకోశ వ్యాధుల వైద్యుడు)కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో శ్వాసకోశ నిపుణుడైన ఓ వైద్యు డు ఆదివారం నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన బుధవారం ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోగా.. గురువారం కొవిడ్ పాజిటివ్ అని నివేదిక వచ్చింది. సదరు వైద్యుడు ఇటీవల కాలంలో విదేశాలకు వెళ్లివచ్చింది లేదు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులకు వైద్యం చేయడం ద్వారా ఆయన కరోనా బారిన పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సదరు వైద్యుడిలో శుక్రవారానికి కొవిడ్ లక్షణాలు కొంతమేర తగ్గుముఖం పట్టినట్టు తెలిసింది. కాగా, కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన వైద్యుడు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయాన్ని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమా గౌరి ధ్రువీకరించారు. బాధిత వైద్యుడు ఐదు రోజులు ఐసోలేషన్ పాటించారని, పూర్తిగా కోలుకున్నారని ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుడి కుటుంబసభ్యులు, సన్నిహితుల్లో కరోనా లక్షణాలు కనిపించలేదని పేర్కొన్నారు. కాగా, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు తమకు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులను, ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.
ప్రత్యేక బృందాలు, వార్డులు..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు నమోదవుతుండడం, రాష్ట్రంలోనూ తొలి కేసు నమోదవ్వడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. నేడో, రేపో ప్రజలకు కొవిడ్ అడ్వైయిజరీ జారీ చేసే అవకాశముంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ పరీక్షలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. గాంధీ, ఫీవర్, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఇప్పటికే రాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ వెంకటి తెలిపారు. కొవిడ్ బాధితుల కోసం గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే ఉన్న 30 పడకల వార్డు ను తిరిగి సిద్ధం చేస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో కూడా కొవిడ్ వార్డును సిద్ధం చేస్తున్నారు. వైద్యాధికారుల ఆదేశాల మేరకు ఫీవర్, చెస్ట్, నిలోఫర్, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నారు. నిజానికి, హైదరాబాద్‌లో అడపాదడపా కొవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శస్త్రచికిత్స లు, ఇతర జబ్బులకు వైద్యం చేసే ముందు ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కొందరికి కొవిడ్ పాజిటివ్ అని వస్తుంది. ఐదు రోజుల క్రితం ఆర్థోపెడిక్ సమస్యతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చిన రోగికి కొవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం
Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్‌లోంచి..
Updated Date - May 24 , 2025 | 03:24 AM