Child Trafficking: సిజేరియన్‌కు ఆమె భర్త ఒప్పుకోవట్లేదు
ABN, Publish Date - Aug 01 , 2025 | 03:45 AM
పిల్లలు లేని దంపతులను మోసం చేసి, డబ్బులు వసూలు చేసేందుకు సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రం
3.5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడంటూ డాక్టర్ నమ్రత డ్రామా
అసలు ‘సరొగసీ’ అనేదే లేకపోయినా.. భారీగా డబ్బు వసూలు
వైద్య పరీక్షల ఫలితాలు ఇవ్వని వైనం.. సృష్టి కేసులో రిమాండ్ రిపోర్ట్
5 రోజుల పోలీసు కస్టడీకి డాక్టర్ నమ్రత
హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట, జూలై 31(ఆంధ్రజ్యోతి): పిల్లలు లేని దంపతులను మోసం చేసి, డబ్బులు వసూలు చేసేందుకు సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఏ అవకాశాన్నీ వదల్లేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సరొగసీ పద్ధతి అని రాజస్థాన్ దంపతులకు నమ్మబలికి.. వారికి అసోంకు చెందిన దంపతుల బిడ్డను ఇచ్చిన కేసులో నమ్రతను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఆమె ఎలా మోసం చేసిందీ పేర్కొన్నారు. దాని ప్రకారం.. సరొగసీ చార్జీలు కాకుండా పరీక్షలు, వీర్యం, అండాల సేకరణ, కాన్పు ఖర్చు అంటూ డబ్బులు వసూలు చేసిన నమ్రత.. చివరికి సిజేరియన్ చేసేందుకు సరొగేట్ మదర్ భర్త ఒప్పుకోవడం లేదంటూ కూడా సొమ్ములు రాబట్టింది. వందలాది మందికి సరొగసీ ద్వారా సంతానం కలిగేలా చేశామని నమ్మబలికి.. రాజస్థాన్ దంపతులను సరొగసీకి ఒప్పించింది. సరొగసీకి కావాల్సిన మహిళను తామే ఏర్పాటు చేస్తామని, పుట్టిన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేయించి మరీ ఇస్తామని నమ్మించి పలు దఫాలుగా రూ.30.26 లక్షలు వసూలు చేసింది. దంపతులకు పలు పరీక్షలు నిర్వహించిన నమ్రత ఫలితాలను పేపర్‌పై చూపడం తప్ప రిపోర్టు కాపీలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది. సరొగసీకి వీర్యం, అండాలు సేకరించాలని ఏపీలోని విశాఖపట్నంలో సృష్టి ఫర్టిలిటీ శాఖకు పంపింది. తర్వాత మరింత డబ్బు దండుకునేందుకు మరో డ్రామాకు తెర తీసింది. ‘మీ బిడ్డను కడుపులో మోస్తున్న మహిళ (సరొగేట్ మదర్)కి కాన్పు కష్టమయ్యే ప్రమాదం ఉంది. సిజేరియన్ చేయాల్సి వస్తుంద’ని రాజస్థాన్ దంపతులకు చెప్పింది. ఆ తర్వాత సిజేరియన్‌కు ఆ మహిళ భర్త అంగీకరించడం లేదని, బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ.3.50 లక్షలు అడుగుతున్నాడని, మీరు రూ.2.50 లక్షలు ఇవ్వాల్సిందేనని తొందరపెట్టింది. నిజానికి సరొగసీ చేయలేదు. సరొగేట్ మదర్ లేదు. ఆమె భర్తా లేడు. కానీ వారు పేరు చెప్పి రాజస్థాన్ దంపతుల నుంచి నమ్రత డబ్బులు వసూలు చేసింది. బాబు పుట్టాడని చెప్పిన నమ్రత వారిని విశాఖ పిలిపించింది. వారిని లోటస్ ఆస్పత్రికి తీసుకెళ్లిన విశాఖ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సిబ్బంది ఓ బాబును అప్పగించారు. డీఎన్‌ఏ పరీక్ష వివరాలు త్వరలో పంపుతామని చెప్పి, బాబును ఇంటికి తీసుకెళ్లాలని నమ్రత వారికి సూచించింది. బిడ్డకు తమ పోలికలు లేకపోవడంపై ఆ దంపతులకు అనుమానం వచ్చి ఢిల్లీలో డీఎన్‌ఏ పరీక్ష చేయించారు. దీంతో ఆ బిడ్డ తమ బిడ్డ కాదని తేలింది.
సికింద్రాబాద్‌లోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌కు వచ్చి నమ్రతను నిలదీశారు. తప్పు జరిగిందని ఒప్పుకున్న ఆమె.. సమస్యను పరిష్కరిస్తానంటూ మరుసటి రోజు రావాలని సూచించింది. తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసిన విజయవాడకు పారిపోయింది. నమ్రత పలు ప్రాంతాల్లో పిల్లలను కొనేందుకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పిల్లలు వద్దనుకున్న అసోంకు చెందిన దంపతుల నుంచి ఓ బాబును సంగారెడ్డి జిన్నారం ప్రాంతానికి చెందిన సంతోషి అనే ఏజెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ బాబునే రాజస్థాన్ దంపతులకు అప్పగించారు. ఈ కేసులో నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ, టెక్నీషియన్ గొల్లమందల నెన్నారావు, అనస్తీషియా వైద్యుడు నాగుల సదానందం, ఏజెంట్ సంతోషి, బాలుడిని విక్రయించిన మహ్మద్ అలీ, నస్రీన్ బేగం (అసోం)ను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలకంగా ఉన్న కల్పన, సంజయ్, నందిని పరారీలో ఉన్నారు. కాగా, డాక్టర్ నమ్రతను 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు సికింద్రాబాద్ కోర్టు గురువారం అనుమతి ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News
Updated Date - Aug 01 , 2025 | 03:45 AM