Share News

Prasanthi Reddy: జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

ABN , Publish Date - Jul 31 , 2025 | 07:24 PM

తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ కావడంపై టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిని పరామర్శించడం వైసీపీ సంస్కృతి అంటూ ఆమె మండిపడ్డారు.

Prasanthi Reddy: జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
MLA Prasanthi Reddy

నెల్లూరు, జులై 31: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించడంపై కోవూరు ఎమ్మెల్యే, టీడీపీ నేత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పందించారు. గురువారం నెల్లూరులో ఎమ్మెల్యే వి.ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలను కించపరిచే వ్యక్తులని పరామర్శిస్తూ ఏం సందేశం ఇస్తున్నారంటూ వైఎస్ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ సైంధవుడిలా రాష్టాభివృద్ధిని అడ్డుకుంటుంటే.. మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పాలిట సైంధవులయ్యారని వ్యంగ్యంగా అన్నారు.


తల్లిని, చెల్లినీ వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగమని ఈ సందర్భంగా ఆమె అభివర్ణించారు. జగన్ జైలు యాత్రలు చూసి ప్రజలు అస్యహించుకుంటున్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లని సమర్ధించడం నాయకుడి లక్షణం కాదన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం ద్వారా వైఎస్ జగన్ తన స్థాయి దిగజార్చుకున్నారని అభిప్రాయపడ్డారు. రూ.500కోట్లతో ఫ్యాక్టరీ పెట్టి గ్రామీణ యువతకి ఉపాధి కల్పించాలన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వీపీఆర్) ఆశయానికి కొందరు నీచులు తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసి కూడా... ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విమర్శించడం భావ్యమా? అంటూ వైఎస్ జగన్‌పై వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు అనిల్, ప్రసన్న లాంటి అచ్చోసిన ఆంబోతుల వల్లే జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందన్నారు. ప్రజలు ఛీ కొట్టి 11 సీట్లకి పరిమితం చేసినా, ఆ పార్టీ నేతల బుద్ధి మాత్రం మారడం లేదని పేర్కొన్నారు. మీ తల్లో, చెల్లో, ఆవిడో రాజకీయాల్లోకి వస్తే.. వాళ్లపై ప్రత్యర్థులు మీలా నోరుపారేసుకుంటే ఊరుకుంటారా? అంటూ వైసీపీ అగ్రనేతలను ఈ సందర్భంగా ఆమె నిలదీశారు. చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనకి ఆకర్షితులై టీడీపీలోకి పలువురు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

మద్యం స్కామ్‌లో స్వాధీనం చేసుకున్న సొమ్ముపై కోర్టు కీలక నిర్ణయం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 09:45 PM