Bhu Bharathi: భూభారతిలో.. ఫీజు మినహాయింపు ఉన్నట్లా? లేనట్లా?
ABN, Publish Date - May 04 , 2025 | 04:53 AM
భూభారతి దరఖాస్తులకు ఫీజు మినహాయింపు ఉన్నట్లా? లేనట్లా? అనే గందరగోళం నెలకొంది. ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న నాలుగు మండలాల్లో వచ్చిన దరఖాస్తులను జూన్ 2లోగా పరిష్కరించాల్సి ఉండగా..
సీసీఎల్‌ఏ నుంచి విడుదల కాని ఉత్తర్వులు
పైలట్ ప్రాజెక్టు మండలాల్లో గందరగోళం
రేపటి నుంచి మరో 28 మండలాల్లో అమలు
రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశం!
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): భూభారతి దరఖాస్తులకు ఫీజు మినహాయింపు ఉన్నట్లా? లేనట్లా? అనే గందరగోళం నెలకొంది. ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న నాలుగు మండలాల్లో వచ్చిన దరఖాస్తులను జూన్ 2లోగా పరిష్కరించాల్సి ఉండగా.. ఫీజు విషయంలో ఎటూ తేలక.. పలు చోట్ల డాక్యుమెంట్లు అప్‌లోడ్ అవ్వడం లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. గత నెల 17న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. ఎలాంటి సేవారుసుం లేకుండానే.. ఉచితంగా సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. అయితే.. పైలట్ ప్రాజెక్టు మండలాల్లో కొన్నిచోట్ల ఫీజు చెల్లించకుండా దరఖాస్తుల అప్‌లోడ్‌కు వీలు కుదరడం లేదని రెవెన్యూ యంత్రాంగం చెప్పడం గమనార్హం..! ఫీజు మినహాయింపుపై అధికారికంగా ఉత్తర్వులు వచ్చాకే.. ఈ సమస్యకు పరిష్కారముంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రేపటి నుంచి 28 మండలాల్లో..
రెండో దశలో భాగంగా ఈనెల 5వ తేదీ నుంచి 28 మండలాలను భూభారతి పరిధిలోకి తీసుకువస్తారు. ఆయా మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించి, దరఖాస్తులను స్వీకరిస్తారు. ముందు నుంచి ప్రభుత్వం సమస్యలను ఉచితంగానే పరిష్కరిస్తామని పేర్కొన్నా.. పైలట్ మండలాల మాదిరిగా ఇక్కడ కూడా దరఖాస్తులు అప్‌లోడ్ కాకపోతే మరింత గందరగోళం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫీజు మినహాయింపు జీవో రానందున.. దరఖాస్తులను ఉచితంగా అప్‌లోడ్ చేయడం కుదరడం లేదని పలువురు డేటా ఎంట్రీ ఆపరేటర్లు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టు తొలిదశ నాలుగు మండలాల్లో వచ్చిన 11,630 దరఖాస్తుల్లో.. పట్టాదార్ పాస్‌పుస్తకాల కోసం 3,446, సాదా బైనామాకు పరిష్కారం కోసం 2,796 అర్జీలు వచ్చినట్లు వివరిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా సేవలకు ఫీజులు ఉండడంతో.. ఉచితంగా అప్‌లోడ్ చేయడం సాధ్యం కావడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎల్‌ఏ అధికారులు సోమవారం ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలున్నాయి. ఆర్థికపరమైన అంశం కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడంలో కాస్త ఆలస్యం జరిగినట్లు.. ఉత్తర్వులు రాగానే భూభారతి పోర్టల్‌లో మార్పులు చేస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం సేవలకు ఫీజులు ఇలా..
రిజిస్ట్రేషన్లకు నిర్ణీత స్టాంప్ డ్యూటీ చెల్లించాలి
రిజిస్ట్రేషన్ స్లాట్ రీ-షెడ్యూల్‌కు మొదటి సారి ఉచితం. రెండోసారి రూ.500. మూడోసారి.. ఆపైన ఆర్నెల్లలోపు రీ-షెడ్యల్‌కు రూ.1000
మ్యుటేషన్ లేదా వారసత్వ సేవలకు ఎకరానికి రూ.2500, లేదా గుంటకు రూ.62.50 ఫీజు ఉంటుంది
పట్టాదారు పాస్ పుస్తకానికి రూ.300
హక్కుల నమోదు సవరణలు, అప్పీళ్ల కోసం రూ.1,000
హక్కుల రికార్డు నకలు కోసం రూ.10
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 04 , 2025 | 04:53 AM