CM Revanth Reddy: ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు
ABN, Publish Date - Jun 17 , 2025 | 03:36 AM
సమావేశాలు, వేదికలపై మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. మనం సాధారణంగా మాట్లాడుకున్న అంశాల్లో కొన్నింటిపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోకముందే వేదికలపై చెబితే ఎలా’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రులతో అన్నారు.
మనం మాట్లాడుకునేవి వేదికలపై చెబితే ఎలా?.. నిర్ణయాలకు ముందే ప్రకటనలా?
సమష్టిగా నిర్ణయాలు తీసుకుందాం..
కలిసి నడుద్దాం.. మంత్రులతో భేటీలో సీఎం
23న సమావేశం కానున్న క్యాబినెట్!
స్థానిక ఎన్నికలతో పాటు పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ‘‘సమావేశాలు, వేదికలపై మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. మనం సాధారణంగా మాట్లాడుకున్న అంశాల్లో కొన్నింటిపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోకముందే వేదికలపై చెబితే ఎలా’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రులతో అన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని సమీకృత పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో మంత్రులతో.. సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పలు అంశాలపై మాట్లాడుతూ.. మంత్రులను సున్నితంగా హెచ్చరించారు. రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎన్నికల అంశం, రైతు భరోసా విషయంపై ఒకరిద్దరు మంత్రులు జిల్లాల పర్యటనలు, సమావేశాల్లో ప్రకటనలు చేశారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వస్తుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గ పర్యటనలో ద్వితియ శ్రేణి నాయకత్వంతో అన్నారు. ఆ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతోపాటు.. స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియరైందంటూ క్షేత్రస్థాయిలో చర్చ జరిగింది. మంత్రుల సమావేశంలో సీఎం ఈ విషయంపైనే కొద్దిసేపు మాట్లాడినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పథకాలు, ప్రకటనలు సహా పలు అంశాలపై మంత్రులెవరూ ‘ఇష్టం వచ్చినట్లు’ మాట్లాడకూడదని, అదే సమయంలో బహిరంగ వేదికలపైనా ప్రకటనలు చేయొద్దని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విధానపరమైన అంశాలపై ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే వాటిని ప్రకటించాలని దిశానిర్దేశం చేశారు. ఇకపై నిర్ణయాలు, ప్రకటనల విషయంలో ఎవరికివారుగా కాకుండా.. కలిసికట్టుగా మాట్లాడాలని సూచించారు. సమష్టిగా ఉంటూ.. కలిసి నిర్ణయాలు తీసుకుని.. వాటినే అందరం కలిసి ప్రకటిద్దామని చెప్పారు. దీంతోపాటు.. బీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయంగా చేస్తున్న విమర్శలు, ఫార్ములా ఈ-కారు రేసు, కాళేశ్వరం విచారణ కమిషన్ వ్యవహారాలపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే.. బీఆర్‌ఎస్, బీజేపీ గురించి ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరంలేదన్న సీఎం.. ‘‘మన పని మనం చేసుకుంటూ వెళ్దాం’’ అని అన్నట్లు సమాచారం. ఇచ్చిన హామీలు, పథకాల అమలు ఎలా ఉందనే దానిపైనే దృష్టిసారించి, ముందుకెళ్లాలని మంత్రులకు సీఎం సూచించారు. స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నాకే సమష్టిగా ప్రకటన చేద్దామంటూ సూచించినట్లు తెలిసింది.
భరోసాకు.. ఎన్నికలకు సంబంధం లేదు
సమావేశంలో స్థానిక ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల కోసమే రైతుభరోసా నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందంటూ రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయన్న విషయాన్ని మంత్రులు.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం మాట్లాడుతూ.. రైౖతుభరోసా అమలు, రైతుల సంఖ్య, నిధుల వ్యవహారం గురించి మంత్రులతో చర్చించారు. రైతుభరోసా కింద అందించే నిధలను నాట్లు వేసుకునే సమాయానికే అందించాలని మొదటినుంచి అనుకుంటున్నదేనని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు, భరోసా నిధుల జమకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. గతంలో ఎన్నడూ రైతులకు 9 రోజుల్లోనే నిధులు జమచేసిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే మొదటిసారిగా వానాకాలం రైతుభరోసా కింద దాదాపు రూ.9వేల కోట్లను 9 రోజుల్లోనే అందించేలా కార్యచరణ తీసుకుందని గుర్తుచేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై క్షేత్రస్థాయి వివరాలను మంత్రులను అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీపై రైతుల అభిప్రాయం ఏమిటని అడిగారు. దీనిపై మంత్రులు ప్రాంతాలవారీగా ఉన్న అభిప్రాయాలను సీఎంకు వివరించారు.
కలిసికట్టుగా.. ‘రైతునేస్తం’కు..
ఇకపై అందరం కలిసికట్టుగా ఉంటూ, సమష్టి నిర్ణయాలు తీసుకుంటూ.. ముందుకువెళ్లాలని సీఎం సూచించగా ఆ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది. ఇందుకు రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమం వేదికైంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రుల సమావేశం నుంచి సీఎం, మంత్రులంతా కలిసికట్టుగా ఆ కార్యక్రమానికి వెళ్లారు.
23న క్యాబినెట్..!
రాష్ట్ర మంత్రివర్గ మండలి సమావేశాన్ని ఈ నెల 23న నిర్వహించనున్నట్లు తెలిసింది. అందులో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారని సమాచారం. అలాగే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మొదట ఏ ఎన్నికలు నిర్వహించాలనేదానిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఇప్పటికే స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో రెండు వేర్వేరు బిల్లులను ప్రవేశ పెట్టింది. ఆ బిల్లుల ఆమోదం కోసం వాటిని పార్లమెంటుకు పంపింది. వాటిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కేంద్రం ఎటూ తేల్చకపోతే.. పార్టీ పరంగా రిజర్వేషన్లను అమలుచేయాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో ఈ అంశంపై క్యాబినెట్‌లో తుది నిర్ణయం తీసుకుంటారు. ఇదే భేటీలో రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణభాగం అలైన్‌మెంట్‌కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మార్గం అలైన్‌మెంట్‌కు సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధమైంది. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకాన్ని జూన్ 2 నుంచే అమలుచేయాలని భావించినా.. పలు కారణాలతో ముందుకు సాగలేదు. దీంతో ఈ పథకం అమలుపైనా చర్చించి, ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అఽధికారవర్గాల ద్వారా తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 17 , 2025 | 03:36 AM