District Collector Field Inspections: పల్లెల వద్దకే పాలన!
ABN, Publish Date - Aug 04 , 2025 | 04:24 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. ప్రధానంగా పాఠశాలలు, వసతి గృహాలు, ఆస్పత్రులను తనిఖీ చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వాటికి ఉచిత ఇసుక సరఫరా, రేషన్ కార్డుల పంపిణీ ఇలా ప్రతి అంశాన్నీ పర్యవేక్షిస్తున్నారు.
సీఎం రేవంత్ ఆదేశంతో క్షేత్రస్థాయికి కలెక్టర్లు
ఇందిరమ్మ ఇళ్ల నుంచి మధ్యాహ్న భోజనం వరకు.. సంక్షేమ, అభివృద్ధి పథకాల పరిశీలన
జిల్లాల కలెక్టర్లతో వాట్సాప్ గ్రూపుల ఏర్పాటు.
నిరంతరం పర్యవేక్షిస్తున్న సీఎంవో అధికారులు
జిల్లాల సమస్యలు, అభివృద్ధిపై సీఎంకు నివేదికలు
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. ప్రధానంగా పాఠశాలలు, వసతి గృహాలు, ఆస్పత్రులను తనిఖీ చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వాటికి ఉచిత ఇసుక సరఫరా, రేషన్ కార్డుల పంపిణీ ఇలా ప్రతి అంశాన్నీ పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సీఎం గత నెల 21న వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏ రోజు ఏం చేశారో మరుసటి రోజు తనకు నివేదిక ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జాగ్రత్తగా పర్యవేక్షించాలని నిర్దేశించారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నుంచి మధ్యాహ్న భోజన పథకం వరకు ప్రతి విషయాన్నీ కలెక్టర్లు పరిశీలిస్తున్నారు. పథకాల లబ్ధిదారులు, విద్యార్ధులతో మాట్లాడుతున్నారు. జిల్లాలో సమస్యలను నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయి అధికారులకు చేరవేస్తున్నారు. దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని అధికారులకు ఒక్కొక్కరికీ ఉమ్మడి జిల్లాల వారీగా అప్పగించిన బాధ్యతల మేరకు ఆయా జిల్లాల అధికారులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాల వారీగా వచ్చిన ఆయా అంశాలు, సమస్యలు, విషయాలను సీఎంవో అధికారులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌కు నివేదిస్తున్నారు. వెరసి రాష్ట్రంలో పాలన పల్లెలకు చేరుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వ్యాధుల బెడద ఉన్న దృష్ట్యా తగు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్లు సందర్శిస్తున్నారు. మందుల లభ్యత ఎలా ఉందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని తండాలు, గిరిజన గూడేల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేస్తున్నారు. భోజనం నాణ్యత, వసతులను పరిశీలిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. ఎరువుల లభ్యత, దుకాణాల్లో ఉన్న నిల్వలు, రికార్డులను పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..
ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
Read latest Telangana News And Telugu News
Updated Date - Aug 04 , 2025 | 04:24 AM