CM Revanth Reddy: చేయాల్సింది చాలా ఉంది..
ABN, Publish Date - Apr 27 , 2025 | 03:57 AM
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. నిజానికి ఇప్పుడే పని మొదలుపెట్టామని.. చేయాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ముందుకు వెళుతున్నాం.. మా మిషన్‌లో మీరూ చేరండి
మీ నైపుణ్యాలను మాతో పంచుకోండి
‘తెలంగాణ రైజింగ్’ బ్రాండ్ అంబాసిడర్లుగా రాష్ట్ర గొప్పతనాన్ని
ప్రపంచానికి చాటండి
భారత్ సదస్సులో ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. నిజానికి ఇప్పుడే పని మొదలుపెట్టామని.. చేయాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు. ప్రజల జీవితాలను మార్చేందుకు తాము చేపట్టిన మిషన్‌లో చేరాలని అందరినీ ఆహ్వానిస్తున్నానని ‘భారత్ సదస్సు’లో పాల్గొన్న దేశ విదేశాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ‘‘మీ అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలను మాతో పంచుకోండి. మీరే ‘తెలంగాణ రైజింగ్’ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పండి’’ అని కోరారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న భారత్ సదస్సులో శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. దేశంలో కుల సర్వే నిర్వహించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని చెప్పారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రంగా కూడా తెలంగాణ నిలిచిందన్నారు.
ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు..
తెలంగాణకు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని.. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాల పోరాటం జరిగిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. విద్యార్థులు, కార్మికులు, రైతులు, మహిళల పోరాటం వల్లే తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి పదేళ్లయినా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని.. ఆ ఆకాంక్షల సాధన కోసమే ప్రజలు కాంగ్రె్‌సకు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశ చరిత్రలోనే అతిపెద్ద సంక్షేమ పథకాలను ప్రారంభించామని చెప్పారు. 2024 ఆగస్టు 15న రూ.20,617 కోట్లతో.. 25లక్షల 50 వేల మంది రైతులను రుణ విముక్తులను చేశామని.. దేశంలోనే ఇది అతిపెద్ద రుణమాఫీ అని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ఏటా ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా, భూమిలేని రైతుకూలీలకు ఏటా రూ.12వేలు సాయం తదితర అంశాలను వివరించారు. భూమిలేని, భూమి ఉన్న రైతులకు కలిపి ఏటా రూ.20,000 కోట్లకుపైగా నిధులు ఇస్తున్నామన్నారు. నాడు భారత తొలి ప్రధాని నెహ్రూ ప్రధానంగా నీటి పారుదల, విద్య అంశాలపై దృష్టి సారించారని.. ఇందిరాగాంధీ రోటీ, కపడా ఔర్ మకాన్ నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్.. ఆధునీకరణ, అభివృద్థి, టెలికాం, సాఫ్ట్‌వేర్ వంటి సాంకేతిక విప్లవాలపై దృష్టి సారించారని వివరించారు. వారి కృషి వల్లే భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. తాము అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 60 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఏడాదిలోనే రాష్ట్రానికి రూ.2.5 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించామని వివరించారు.
రాష్ట్రంలో మహిళా సాధికారత..
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చూడాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నామని సీఎం చెప్పారు. సోలార్ పవర్ ప్లాంట్లు, ఎలక్ర్టిక్ ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులకు మహిళలను యజమానులను చేశామన్నారు. తొలి ఏడాది 4,50,000 కుటుంబాలకు సొంత ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 22వేల కోట్లు అందించనున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని.. ఇందుకోసం 15 నెలల్లో రూ. 5వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం పథకాలనూ వివరించారు. మూసీ పునరుజ్జీవనంతో హైదరాబాద్‌కు కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. భవిష్యత్తులో మూసీ హైదరాబాద్ నగరానికి అతిపెద్ద ఆకర్షణగా మారి వేలాది మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో 30వేల ఎకరాల్లో ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్థి చేస్తున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 27 , 2025 | 03:57 AM