Hyderabad: 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ఎజెండా
ABN, Publish Date - Jul 13 , 2025 | 03:53 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో తన నిబద్ధతను ప్రశ్నించలేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు ఆ నైతిక హక్కు లేదన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం..
రిజర్వేషన్లపై నా నిబద్ధతను ప్రశ్నించలేరు
మోదీ స్థానంలో రాహుల్‌గాంధీ ఉంటే..
48 గంటల్లో రిజర్వేషన్లను సాధించేవాడిని
చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వమే
మంత్రులు, బీసీ నేతలతో భేటీలో సీఎం
హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో తన నిబద్ధతను ప్రశ్నించలేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు ఆ నైతిక హక్కు లేదన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఇంకా ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే అర్ధరాత్రైనా మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దంటూ గత కేసీఆర్ ప్రభుత్వం చట్టం చేసిందని, అప్పుడు గంగుల కమలాకర్, శ్రీనివా్‌సగౌడ్, శ్రీనివాస్‌యాదవ్ మంత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ ఇప్పుడు వారినే తమపైకి ఉసిగొల్పుతున్నారని చెప్పారు. ఆ చట్టంలో పేర్కొన్న 50 శాతం నిబంధనను సవరిస్తూ తాము ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువస్తున్నామన్నారు. ఈ విషయంలో ఎవరైనా కోర్టుకు వెళితే వాదించడానికి ఢిల్లీ నుంచి ఉద్ధండులైనన్యాయవాదులను నియమిస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ఎంపీలతోపాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని, అన్ని రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లు అమలైతేనే నిజమైన విజయమని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన ఎజెండా కావాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డిని శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌తోపాటు మరికొంత మంది బీసీ నేతలు కూడా సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వీరందరితో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ సమావేశమై మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రె్‌సకు చిత్తశుద్ధి లేదంటూ కొంతమంది విమర్శిస్తున్నారని, చిత్తశుద్ధి లేనిది బీజేపీకేనని అన్నారు. బీసీ రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌తోపాటు ఎంపీలు లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య దీనిని సాధించాలన్నారు. ప్రధానిగా మోదీ స్థానంలో రాహుల్‌గాంధీ ఉండి ఉంటే తాను 48గంటల్లోనే రిజర్వేషన్లను సాధించుకొచ్చేవాడినని తెలిపారు. ఈ విషయంపై ప్రధానిని తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రశ్నించాలని, రిజర్వేషన్లపై వారి నిబద్ధతను నిరూపించుకోవాలని సూచించారు. నెల రోజుల్లో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించిందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించడం కోసమే ఇంతకాలం స్థానిక ఎన్నికలను వాయిదా వేశామని చెప్పారు. తనకు తోడుగా ఉండడంతోపాటు రిజర్వేషన్లకు రక్షణ కవచంలా ఉండి కాపాడుకోవాలని సమావేశంలో పాల్గొన్న వారినుద్దేశించి వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసే వారిని, వేయించే వారందరినీ సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించాలన్నారు. తెలంగాణ నిర్ణయమే దేశాన్ని ప్రభావితం చేసిందని, ఈ ఒత్తిడికి లొంగిన కేంద్రం 2026లో చేసే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలంటూ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు 16పార్టీలు మద్దతిచ్చాయని చెప్పారు.
ఆ బాధ్యత మాపై ఉంది..
అధికారంలోకి రాగానే కులగణన చేస్తామంటూ రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చాల్సిన బాధ్యత తనతోపాటు పీసీసీ అధ్యక్షుడిపై ఉందన్నారు. అందుకే ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి ఏడాదిలో కులగణనను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. కులగణనకు వ్యతిరేకంగా బీజేపీ గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తుచేశారు. రాహుల్, ఖర్గే.. తెలంగాణ తరహాకులగణనను దేశమంతా చేయాలంటూ కోరుతున్నారని అన్నారు. కులగణన వివరాలను వందశాతం డిజిటలైజేషన్ చేశామని, ఎవరూ చాలెంజ్ చేయడానికి వీల్లేకుండా డేటాను భద్రపరిచామని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, జూపల్లి, సీఎం సలహాదారు వేం నరేందరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు
కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 13 , 2025 | 03:54 AM