ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: విదేశీ విద్యకు వెంపర్లాడొద్దు!

ABN, Publish Date - Jul 13 , 2025 | 03:36 AM

న్యాయవాదం అత్యంత గౌరవప్రదమైన వృత్తి అయినప్పటికీ ఇందులో రాచబాట అంటూ ఏదీ ఉండదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అన్నారు.

  • అప్పులతో అమ్మానాన్నలకు బరువు కావొద్దు

  • అదే మీ విలువ నిర్ధారిస్తుందనుకుంటే పొరపాటే

  • ఆ 70 లక్షలతో ఇక్కడే వృత్తికి పదును పెట్టొచ్చు

  • న్యాయ వృత్తి గౌరవప్రదమే కానీ రాచబాట కాదు

  • ఫలితాలు వస్తాయనే గ్యారెంటీ కూడా లేదు

  • నిత్యం నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిందే

  • నల్సార్‌ స్నాతకోత్సవంలో సీజేఐ జస్టిస్‌ గవాయ్‌

  • బంగారు పతకాలు ప్రదానం చేసిన సీఎం

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదం అత్యంత గౌరవప్రదమైన వృత్తి అయినప్పటికీ ఇందులో రాచబాట అంటూ ఏదీ ఉండదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అన్నారు. శనివారం శామీర్‌పేట్‌లోని నల్సార్‌ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిఘంటం శ్రీ నర్సింహ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, వైస్‌ ఛాన్స్‌లర్‌ శ్రీకృష్ణదేవరావులతో కలిసి సీజేఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ మాట్లాడుతూ, న్యాయవాద వృత్తిలో కచ్చితమైన ఫలితాలు వస్తాయనే గ్యారెంటీ లేదని చెప్పారు. ‘‘న్యాయవాదం ఎంచుకున్న ప్రతీ ఒక్కరికీ ఫలితాలు వస్తాయని గ్యారెంటీ లేదు. కోర్టుకు, నిన్ను ఆశ్రయించే కక్షిదారులకు నిత్యం నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. మరోవైపు నీ ఆత్మసాక్షి కూడా నిన్ను అంచనా వేస్తుంది.. నీవు వెళ్లే మార్గాన్ని ప్రశ్నిస్తుంది. చాలా అంశాలపై స్పష్టత ఉండాలి. ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ‘మండేలా బ్రీఫ్‌’ పుస్తక రచయిత థామస్‌ గ్రాంట్‌ న్యాయవాద వృత్తికి గొప్ప నిర్వచనాన్ని ఇచ్చారు. ‘ఈ వృత్తిలో అంచనాలు భారీగా ఉంటాయి. ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తుంది. భావోద్వేగ పరంగా మనల్ని ఒంటరిని చేస్తుంది. కొన్సిసార్లు సక్సెస్‌ అయినట్లు కనిపించడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది’ అని చెప్పారు.

అమెరికాలో ఒక అధ్యయనం ప్రకారం న్యాయవాదులుతమ వృత్తిని చివరి వరకు కొనసాగించలేక పోతున్నట్లు తేలింది. డేటా ప్రైవసీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాలకు సైతం లా విస్తరిస్తోంది. చట్టంలోని ప్రాథమిక భావనలను కచ్చితత్వంతో స్పష్టంగా ఎవరు చెప్తారో వారే ఈ వృత్తిలో గట్టిగా బలమైన నిపుణులుగా నిలబడతారు. ప్రతి కొత్త పోకడను ఆకళింపు చేసుకునే వారు కాదు. మీరు ప్రతిచోటా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోటే బలంగా ఉంటే సరిపోతుంది. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ చెప్పిన విధంగా మీపై మీరు విశ్వాసం కలిగి ఉండండి. ప్రతిదీ పుస్తకాల్లో, తీర్పుల్లో దొరకదు. ఇతరుల అనుభవాల నుంచి, మెంటార్‌షిప్‌ నుంచి నేర్చుకోవాలి. అధికారంలో ఉన్న వారి మార్గదర్శకత్వం కోరుకోకండి. సమగ్రత ఉన్న వారి మార్గదర్శకత్వంలో పని చేయండి. ఒక నాటికి మీరే మార్గదర్శకులుగా మారుతారు. విదేశాల్లో మాస్టర్‌ డిగ్రీ చదువుతా అని తల్లిదండ్రులపై ఒత్తిడి చేయకండి. రూ.50 నుంచి రూ.70 లక్షలు ఖర్చు పెట్టి కుటుంబానికి భారం కాకండి. కేవలం విదేశీ డిగ్రీ మాత్రమే మీ విలువను నిర్ధారిస్తుందని అనుకోవద్దు. ఇతరుల ఒత్తిడితో విదేశీ విద్యకు వెళ్లి ఒత్తిడికి గురయ్యే బదులు అందులో కొంత మొత్తం పెట్టుబడి పెట్టి స్వతంత్రంగా ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు. విదేశీ డిగ్రీ పోకడ పెరగడం దేశంలోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌, దేశంలో పరిశోధనపై విశ్వాసం లేకపోవడాన్ని సూచిస్తోంది. దేశంలో న్యాయ పరిశోధన, శిక్షణపై విశ్వాసాన్ని పాదుకొల్పాల్సిన అవసరం ఉంది’’ అన్నారు.

బంగారు పతకాలు అందజేసిన సీఎం

పీహెచ్‌డీలు, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, ఎంఏ ట్యాక్సేషన్‌ లా, క్రిమినల్‌ జస్టిస్‌ మేనేజ్‌మెంట్‌, బీఏఎల్‌ఎల్‌బీ హానర్స్‌, బీబీఏ హానర్స్‌, బీబీఏ, పీజీడిప్లొమో ఇన్‌ ట్యాక్సేషన్‌, పీజీ డిప్లొమో ఇన్‌ క్రిమినల్‌ జస్టిస్‌ మేనేజ్‌మెంట్‌ తదితర కోర్సుల్లో విద్యను పూర్తి చేసిన మొత్తం 462 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమంలో డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బంగారు పతకాలు అందజేశారు. ఎల్‌ఎల్‌ఎంలో ముస్కాన్‌ కార్లా రెండు బంగారు పతకాలు, బీ హరిణి, హుజైఫా షేక్‌, నందిని ఒక్కోటి, బీఏ ఎల్‌ఎల్‌బీ హానర్స్‌కు చెందిన ఇషికా గార్గ్‌ ఎనిమిది బంగారు పతకాలు, కేఎస్‌ శైలేంద్ర ఏడు, అర్చిత ఆరు, భవ్య నాలుగు, తేజస్విని, శృతి, అఖిల్‌ సూర్య మూడు చొప్పున, సాన్వి, శ్రీవల్లి, అనుష్క, అరివళగన్‌, జాన్వి, ప్రద్యుమ్న, షామిక్‌, విష్ణు ఒక్కోటి చొప్పున బంగారు పతకాలు అందుకున్నారు. పిల్లల హక్కులు, నాల్సార్‌ లా రివ్యూ పుస్తకాలను సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, సీఎం రేవంత్‌రెడ్డి, జస్టిస్‌ పీఎస్‌ నర్సింహ, జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, వీసీ శ్రీకృష్ణదేవరావు ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 03:36 AM