Sitarama Sagar Project: సీతారామకు సాంకేతిక అనుమతి
ABN, Publish Date - Apr 25 , 2025 | 04:13 AM
సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) సాంకేతిక అనుమతి మంజూరు చేసింది.
పర్యావరణ, జల విద్యుత్తు డిజైన్లకు లోబడి క్లియరెన్స్
టీఏసీ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వెల్లడి
ప్రాజెక్టులో ముందడుగు.. లక్షల ఎకరాలు సాగులోకి: భట్టి
పనులు పరుగులు పెట్టిస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్/ఢిల్లీ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) సాంకేతిక అనుమతి మంజూరు చేసింది. గురువారం ఢిల్లీలో దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన 158వ టీఏసీ సమావేశానికి కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్ డాక్టర్ ముకేష్ కుమార్ సిన్హాతో పాటు తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ(జనరల్) జీ అనిల్‌కుమార్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఎస్‌ఈ ఎస్.విజయకుమార్, కొత్తగూడెం ఎస్‌ఈ శ్రీనివా్‌సరెడ్డి, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.సుబ్రమణ్యం ప్రసాద్ హాజరయ్యారు. బ్యారేజీ స్టెబిలిటీ డిజైన్లు, డ్రాయింగ్‌లు సరిగ్గానే ఉన్నాయని సీడబ్ల్యూసీ తెలిపింది. ప్రాజెక్టుపై టీఏసీ లేవనెత్తిన అభ్యంతరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇస్తామని తెలంగాణ అధికారులు తెలిపారు. జలవిద్యుత్ ఉత్పాదనకు పనులేవీ చేపట్టడం లేదని, దీన్ని కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) చూస్తుందని తెలిపారు. పర్యావరణ అనుమతి (ఈసీ) పెండింగ్‌లో ఉంద ని, బ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టరాదని ఆదేశాలు న్నాయి కదా అని దేబశ్రీ ముఖర్జీ అడగ్గా... పర్యావరణానికి జరిగిన నష్టానికి పరిహారం కింద రూ.53 కోట్లు జమచేశామని తెలంగాణ అధికారులు తెలిపారు. దాంతో ఈసీ కోసం అదనపు టర్మ్ అండ్ రిఫరెన్స్(టీవోఆర్)జారీ అయిందని, దాని ప్రకారం పర్యావరణ అనుమతి సాధించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాంతో జల విద్యుత్ డిజైన్లు, పర్యావరణ అనుమతికి లోబడి క్లియరెన్స్ ఇస్తున్నామని దేబశ్రీ ముఖర్జీ తెలిపారు. మైక్రో ఇరిగేషన్‌పై ఆరా తీయగా కొన్ని డిస్ట్రిబ్యూటరీల కింద ఆయిల్‌పామ్‌తో పాటు ఇతర పంటల కోసం పైప్డ్ ఇరిగేషన్ విధానం అమలు చేయనున్నామని తెలంగాణ అధికారు లు వివరించారు. దాంతో అన్ని అంశాలు సరిగ్గానే ఉన్నాయంటూ తెలంగాణ అధికారులను అభినందించారు.
ఫలించిన ఉత్తమ్ వ్యూహం
ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై నిర్ణయంతో పాటు పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనుసరించిన వ్యూహం ఫలించింది. తెలంగాణ వచ్చాకా గోదావరి బేసిన్‌లో పలు ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోగా... కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తర్వాత ఇదే అతిపెద్ద ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్-1లోని కాంపోనెంట్లన్నీ రెండున్నరేళ్లకు పైగా నిరుపయోగంగా ఉండగా... కీలకమైన బ్యారేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దాంతో గోదావరి బేసిన్‌లో సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు కీలకం కానుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 67.05 టీఎంసీల నీటిని ప్రాజెక్టుకు కేటాయిస్తూ మంత్రి ఉత్తమ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి కోసం అధికారులకు పలు సూచన లు చేశారు. ఈ ప్రాజెక్టు కింద భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 7.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పాలేరు, వైరా రిజర్వాయర్ల కింద సాగర్ ఆయకట్టును స్థిరీకరించడం కూడా ప్రాజెక్టు లక్ష్యాల్లో ఒకటి. సీతమ్మ సాగర్ బ్యారేజీలో 282.80 మెగావాట్ల సామర్థ్యం జల విద్యుత్ కేంద్రాలు కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.19,955కోట్లు కాగా... ఇప్పటిదాకా 57 శాతం మేర అంటే రూ.11,320 కోట్లు వెచ్చించారు. 2026 రబీ నాటికిప్రాజెక్టును పూర్తిచేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం.
ఇక పీఎంకేఎ్‌సవై కింద అనుమతి కోసం...
కీలకమైన సాంకేతిక అనుమతి సాధించడంతో ఈ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి కృషి సింఛాయ్ యోజన (పీఎం కేఎ్‌సవై, సత్వరసాగు నీటి ప్రయోజన పథకం-ఏఐబీపీ)కింద అనుమతికోసం దరఖాస్తు చేసుకోనున్నారు. దీని కింద మరో రూ.8635 కోట్లు వెచ్చించాల్సి ఉండగా... కేంద్ర సహాయం అందితే 60 శాతం నిధులు సమకూరనున్నాయి. ప్రాజెక్టు గిరిజన/కొండ ప్రాంతాల్లో ఉండటం తో కేంద్ర సహాయానికి అనుకూలతలు ఏర్పడనున్నాయి.
లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయి: భట్టి
సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి రావడంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. ఈ ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటిని కేటాయించి... దానికి చట్టబద్ధత సాధించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఆయన అభినందించారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత అనుమతులు వచ్చాయన్నారు.
పనులను పరుగులు పెట్టిస్తాం: తుమ్మల
ఖమ్మం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గోదావరిపై దుమ్మగూడెం వద్ద నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజీ పనులకు, ఇప్పటికే ప్రారంభించిన సీతారామ ఎత్తిపోతల పథకానికి అనుమతులు లభించడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో 104 కిలో మీటర్లు ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మిగిలిన 125 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 8 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, భూసేకరణ సర్వే జరుగుతోందని తెలిపారు. సాంకేతిక అనుమతులు లభించడంతో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి
Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..
Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 25 , 2025 | 04:13 AM