Farmer Support: ఒకేసారి రైతు భరోసా
ABN, Publish Date - Jun 06 , 2025 | 02:44 AM
ఇన్నాళ్లుగా ఇస్తున్నట్టు దఫదఫాలుగా కాకుండా రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా మొత్తాన్ని అందించాలనే ప్రతిపాదనపై.. గురువారంనాటి క్యాబినెట్ భేటీలో చర్చ జరిగింది.
అదీ.. పంట వేసేనాటికే అందరికీ!
నిధులు జమ చేసుకుని మంచిరోజున
ఇవ్వాలని క్యాబినెట్ భేటీలో అభిప్రాయం
నష్టం వచ్చినా 2 పంటలకూ బోనస్!
హైదరాబాద్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లుగా ఇస్తున్నట్టు దఫదఫాలుగా కాకుండా రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా మొత్తాన్ని అందించాలనే ప్రతిపాదనపై.. గురువారంనాటి క్యాబినెట్ భేటీలో చర్చ జరిగింది. అలా ఒకేసారి ఇవ్వడానికి అవసరమైన నిధులు జమచేసుకుని.. ఒక మంచి రోజు చూసుకుని ఆ మొత్తాన్ని, అదీ పంటవేసేనాటికే ఇవ్వాలనే మంత్రివర్గం అభిప్రాయపడింది. అలాగే.. ఈ భేటీలో సన్నధాన్యానికి బోనస్ విషయంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. వానకాలం పంటకు మాత్రం బోనస్ ఇద్దామని.. యాసంగి పంటకు కూడా ఇస్తే నష్టం వస్తుందని అధికారులు చెప్పినట్టు తెలిసింది.
యాసంగి ధాన్యంలో నూక శాతం ఎక్కువగా ఉంటుందని, దీంతో బియ్యం శాతం తక్కువ అవుతుందని.. ఆ బియ్యాన్ని బాయిల్ చేయాలంటే మళ్లీ ఖర్చు అవుతుందని.. బోనస్ ఇవ్వడం వల్ల నష్టం వస్తుందని వారు వివరించినట్టు సమాచారం. అయితే మంత్రి వర్గం మాత్రం దీనికి ఒప్పుకోలేదు. నష్టం వచ్చినా రెండు పంటలకూ బోనస్ ఇవ్వాలనే నిర్ణయించింది. పంటలు పండించే రైతుకే నేరుగా బోనస్ వెళుతున్నందున.. అది ఉపయోగపడుతుందని మంత్రివర్గం అభిప్రాయపడింది.
Updated Date - Jun 06 , 2025 | 02:44 AM