Online Building Permits: అధికారులు.. ఆర్కిటెక్ట్‌లకే బిల్డ్ నౌ!
ABN, Publish Date - Jul 21 , 2025 | 03:29 AM
భవన నిర్మాణాలు, లేఅవుట్ అనుమతులు వేగంగా, పారదర్శకంగా ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు తీసుకొచ్చిన బిల్డ్‌నౌ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ పరిస్థితి విచిత్రంగా మారింది.
దరఖాస్తుదారులకు నో యాక్సెస్!
లాగిన్ అయినా కనిపించని ఫైల్
వివరాలిచ్చినా.. కానరాని సమాచారం
అధికారులకు పెండింగ్ సమయం ఎత్తివేత
హైదరాబాద్ సిటీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణాలు, లేఅవుట్ అనుమతులు వేగంగా, పారదర్శకంగా ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు తీసుకొచ్చిన బిల్డ్‌నౌ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ పరిస్థితి విచిత్రంగా మారింది. అధికారులు దరఖాస్తు పరిశీలన ప్రక్రియ అత్యంత వేగంగా సెకన్ల వ్యవధిలో పూర్తవుతోంది. కానీ ఏ అధికారి వద్ద ఎంత సమయం పాటు దరఖాస్తు ఉందనే విషయాన్ని మాత్రం చూపడం లేదు. ఇక దరఖాస్తుదారుకు మాత్రం లాగిన్‌లో సంబంధిత ఫైల్ కనిపించడం లేదు. బిల్డ్‌నౌ ‘కీ’ఉన్న ఆర్కిటెక్ట్‌లు, అధికారులకు మాత్రమే దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉందనే విషయం తెలుస్తోంది. దరఖాస్తుదారులకు ‘సిటిజన్ సెర్చ్’ ఆప్షన్ అందుబాటులో ఉన్నా.. అందులో వివరాలు నమోదు చేసినా ఎలాంటి సమాచారం కనిపించకపోవడం గమనార్హం..! ఆన్‌లైన్‌లో భవన నిర్మాణాలు, లేఅవుట్ అనుమతులను జారీ చేసే ప్రక్రియను దేశంలోనే తొలిసారిగా హెచ్‌ఎండీఏలో పరిచయం చేశారు. తొలుత డెవల్‌పమెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(డీపీఎంఎస్) పరిచయమై.. ఆ తర్వాత టీజీబీపా్‌సగా రూపాంతరం చెంది.. ప్రస్తుతం ‘బిల్డ్‌నౌ’గా ఈ విధానం కొనసాగుతోంది. టీజీబీపా్‌సలో దరఖాస్తు ఏ అధికారి వద్ద ఎన్ని రోజులుగా పెండింగ్ ఉందో తెలిసేది. రోజులు, గంటలు, నిమిషాలు, సెకన్లతో సహా ఆన్‌లైన్‌లో దరఖాస్తుదారుడికి కనిపించేది. ఈ వివరాల ఆధారంగానే గతంలో మునిసిపల్ శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్‌ఎండీఏ అధికారులకు దరఖాస్తులను పరిష్కారం చేయకుండా ఏడు రోజులకు పైగా లాగిన్‌లో పెండింగ్ పెడితే.. వారికి జరిమానా విధించేవారు. దాంతో ఏ అధికారి కూడా ఏడు రోజుల్లో దరఖాస్తులను ఆమోదించడమో.. తిరస్కరించడమో చేసేవారు. ఇప్పుడు బిల్డ్‌నౌ అప్లికేషన్‌లో అధికారుల వద్ద ఎంతకాలంగా దరఖాస్తు పెండింగ్‌లో ఉందనే వివరాలు కనిపించడం లేదు. దీన్ని బట్టి.. ఆలస్యం చేసే అధికారులకు జరిమానాలను విధించే విధానాన్ని ఎత్తివేసినట్లు స్పష్టమవుతోంది.
కనిపించని ఫైల్
నిజాంపేటకు చెందిన ఓ వ్యక్తి గ్రౌండ్ ప్లస్ 2 భవన నిర్మాణ అనుమతులకు బిల్డ్‌నౌలో దరఖాస్తు చేశారు. తన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి.. ఆర్కిటెక్ట్ కీ ద్వారా దరఖాస్తును అప్‌లోడ్ చేశారు. అయితే తన దరఖాస్తు ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందనే సమాచారం మాత్రం ఆయనకు తెలియడం లేదు. మొబైల్‌లో లాగిన్ అయ్యి, పరిశీలిస్తే.. దరఖాస్తే కనిపించడం లేదు. ‘‘నో అప్లికేషన్’’ అని చూపిస్తోంది! సదరు ఆర్కిటెక్ట్ తన ‘కీ’ ద్వారా లాగిన్ అయితేనే వివరాలు తెలుస్తున్నాయి. ఇక సిటిజన్ సెర్చ్ అనే ఆప్షన్‌ను బిల్డ్ నౌలో పరిచయం చేసినా.. తగిన సమాచారం రావడం లేదు. నామ్‌కేవాస్తే.. అన్నట్లుగా దీన్ని తీసుకువచ్చారనిదరఖాస్తుదారులు విమర్శిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 21 , 2025 | 03:29 AM