BJP: బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
ABN, Publish Date - Jul 15 , 2025 | 05:55 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని, అయితే తాము మతపరమైన రిజర్వేషన్లను ఒప్పుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు స్పష్టం చేశారు.
మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం
నల్లగొండ పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యలు
నల్లగొండ టౌన్, జూలై 14(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని, అయితే తాము మతపరమైన రిజర్వేషన్లను ఒప్పుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారిగా నల్లగొండకు వచ్చిన ఆయన కార్యకర్తల సమ్మేళనం అనంతరం మీడియాతో మాట్లాడారు. 42శాతం రిజర్వేషన్లలో 10శాతం ముస్లిం రిజర్వేషన్లను(మతపరమైన రిజర్వేషన్లు) వ్యతిరేకిస్తున్నామన్నారు.
సుప్రీంకోర్టు కూడా దీనిని అంగీకరించలేదని ఆయన గుర్తు చేశారు. మతపరమైన రిజర్వేషన్ల వల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతుందని రాష్ట్ర బీసీలు గుర్తించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారి కార్యకర్తలకే రేషన్‌కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని, ఇప్పటికే దళారులు రంగంలోకి దిగారని ఆయన ఆరోపించారు. నల్లగొండ గడ్డపై కుటుంబ పాలనను అంతం చేయాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పోరాడాలని, బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాంచందర్‌రావు చెప్పారు.
Updated Date - Jul 15 , 2025 | 05:55 AM