Bandi Sanjay: బనకచర్లపై ఏం జరిగిందో ఇద్దరు సీఎంలూ చెప్పాలి
ABN, Publish Date - Jul 18 , 2025 | 04:21 AM
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు బహిర్గతం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఇద్దరూ సొంత అజెండాలతో ఢిల్లీ సమావేశానికి వెళ్లారు
42% రిజర్వేషన్లు బీసీలకేనంటే ప్రధానిని ఒప్పిస్తా: సంజయ్
హుజూరాబాద్, జూలై 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు బహిర్గతం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. సమావేశంలో ఏం జరిగిందో ఇరు రాష్ట్రాల ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వారిద్దరిపై ఉందని, ఇద్దరూ తలో మాట తలో మాట చెప్పడం సరికాదన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో సంజయ్ విలేకరులతో మాట్లాడారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సొంత అజెండాతో సమావేశానికి వెళ్లినట్లు కబనడుతోందన్నారు. జల వివాదాలపై బీఆర్‌ఎస్ ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏపీలోని నాటి ప్రభుత్వంతో కుమ్మక్కై కృష్ణా జలాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో ఉన్నట్లుందన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే అందజేస్తానంటే ప్రధాని మోదీని ఒప్పించి బిల్లును ఆమోదింపజేసేందుకు కృషి చేస్తానని సంజయ్ చెప్పారు. అలా కాకుండా 42శాతం రిజర్వేషన్లలో 10శాతం ముస్లింలకు ఇస్తానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. బీసీల ముసుగులో తెలంగాణలో ముస్లింలందరికీ నూరు శాతం రిజర్వేషన్లు అందించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరిగేషన్ అధికారుల అవినీతిని చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 24న విచారణకు రావాలని సిట్ నుంచి సమాచారం వచ్చిందని తెలిపారు.
ట్యాపింగ్ కేసులో సంజయ్‌కు నోటీసు
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు సిట్ అధికారులు నోటీసు జారీ చేశారు. అలాగే ఆయన పీఆర్‌ఓ పసునూరు మధు, పీఏ బోయిన్‌పల్లి ప్రవీణ్‌రావు, మాజీ పీఏ పోగుల తిరుపతిలకు నోటీసులు ఇచ్చారు. ఈనెల 24న 11 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరారు. అయితే, తాను సిట్ కార్యాలయానికి రాలేనని లేక్ వ్యూ గెస్ట్‌హౌ్‌సలో ఉంటానని, అక్కడికి వచ్చి వాంగ్మూలం రికార్డు చేసుకోవాలని సంజయ్ అధికారులను కోరారు. దీనికి సిట్ అధికారులు అంగీకరించారు.
కేసీఆర్ నీచమైన పనుల ఫలితమే..
కేసీఆర్ చేసిన నీచమైన పనుల ఫలితంగానే ఈ రోజు ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల నుంచి ఈ ‘లవ్ లెటర్’ (నోటీసులు) అందుకోవాల్సి వచ్చిందని సంజయ్ అన్నారు. ‘నాతో పాటు నా కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచుడు కేసీఆర్. ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన దుర్మార్గ కుటుంబం కేసీఆర్‌దే’నని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 18 , 2025 | 04:21 AM