ACB Investigation: ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌కు ఏసీబీ మళ్లీ పిలుపు
ABN, Publish Date - Jun 26 , 2025 | 03:29 AM
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను మరోసారి ప్రశ్నించడానికి ఏసీబీ అధికారులు సన్నద్దమయ్యారు.
జూలై 1న హాజరు కావాలంటూ నోటీసు
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో వాట్సాప్ చాట్‌పై ఫోకస్
హైదరాబాద్, జూన్25(ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను మరోసారి ప్రశ్నించడానికి ఏసీబీ అధికారులు సన్నద్దమయ్యారు. వచ్చేనెల 1వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈ మెయిల్ ద్వారా నోటీసు పంపించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ నెల 16న ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఒప్పందం జరిగిన తర్వాత నిధుల విడుదలకు సంబంధించి అర్వింద్‌కుమార్, కేటీఆర్ మధ్య వాట్సాప్ చాట్ జరిగిందని, ఇందుకు తగిన ఆధారాలను గతంలో అర్వింద్‌కుమార్ ఏసీబీకి అందచేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కేటీఆర్ ఫోన్‌ను పరిశీలించి ఆ సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి ఏసీబీ యత్నిస్తోంది. కేటీఆర్ తన సెల్‌ఫోన్ అప్పగించ కపోవవడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. హెచ్‌ఎండీఏ నిధుల నుంచి సుమారు 55కోట్ల నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్ధకు చెల్లించడానికి ముందు కేటీఆర్, అరవిందకుమార్‌ల మధ్య జరిగిన ఫోన్ చాట్ ఈ కేసులో కీలకంగా మారనుందని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. కేటీఆర్ చెప్పిన అంశాలపై అరవిందకుమార్‌ను విచారించిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలకు ఏసీబీ సన్నద్ధమౌతోంది.
Updated Date - Jun 26 , 2025 | 03:29 AM