ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కల్తీ కల్లుకు ఆరుగురు బలి

ABN, Publish Date - Jul 10 , 2025 | 04:42 AM

రాజధాని హైదరాబాద్‌లో కల్తీ కల్లుకు ఆరుగురు బలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

మరో ముగ్గురి పరిస్థితి విషమం హైదరాబాద్‌లో విషాదం

  • నిమ్స్‌లో 31 మందికి చికిత్స.. అక్కడ పడకలు లేక కొందరికి గాంధీలో వైద్యం

  • హైదర్‌నగర్‌, శంషీగూడ, ఇందిరానగర్‌ కల్లు కాంపౌండ్లలో కొద్దిరోజుల క్రితం

  • కల్లు తాగిన పలువురికి అస్వస్థత.. విషయం పొక్కకుండా నిర్వాహకుల యత్నాలు

  • మృతులు, బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో గుట్టు రట్టు

  • కల్లుకాంపౌండ్‌ నిర్వాహకులు ఐదుగురిపై కేసులు నమోదు..

  • కల్తీ కల్లు విక్రయదారులపై కఠిన చర్యలు: మంత్రి జూపల్లి హెచ్చరిక

  • పలు ప్రాంతాల్లో కల్లు కాంపౌండర్ల‌‌పై ఎస్‌వోటీ, ఎక్సైజ్‌ దాడులు

హైదరాబాద్‌ సిటీ/హైదర్‌నగర్‌/ నిమ్స్‌, అల్వాల్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లో కల్తీ కల్లుకు ఆరుగురు బలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మంగళవారంనాటికి 16 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరగా.. బుధవారం ఆ సంఖ్య 40 దాటినట్టు సమాచారం. నిమ్స్‌లో ప్రస్తుతం 31 మంది చికిత్స పొందుతుండగా.. అక్కడ పడకలు లేవని కొందరిని గాంధీ ఆస్పత్రికి, కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు పంపించారు. అస్వస్థతకు గురైన వారిలో కొందరిని ఐసీయు, మరికొందరిని ఏసీసీయు విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న మోన్నప్ప (65) అనే వృద్ధుడికి వెంటిలేటర్‌ చికిత్స అందిస్తున్నారు. దేవదాస్‌ అనే వ్యక్తికి డయాలసిస్‌ మొదలు పెట్టారు. కృష్ణయ్య అనే వ్యక్తికి కూడా డయాలసిస్‌ అవసరమవుతుందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా కల్తీ కల్లు బారిన పడిన వారందరి రక్తంలో క్రియాటినైన్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. బాధితులంతా.. నగరంలోని హైదర్‌నగర్‌, ఇందిరానగర్‌, శంషీగూడలోని కల్లు కాంపౌండ్లలో కిందటి శనివారం కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రులకు తరలించారు. హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు తాగిన చాకలి బొజ్జయ్య (55- ఆల్విన్‌కాలనీ డివిజన్‌ సాయిచరణ్‌ కాలనీ) వాంతులు విరేచనాలతో బాధపడుతుండడంతో సోమవారం ఉదయం కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మృతి చెందారు. అదే ప్రాంతానికి చెందిన నారాయణమ్మ(65).. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మరణించారు. తమ వద్ద కల్లు తాగినవారంతా అస్వస్థతకు గురవుతుండడం.. కొందరు ప్రాణాలు కోల్పోవడంతో అప్రమత్తమైన కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు.. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే.. హైదర్‌నగర్‌ కాంపౌండ్‌లోనే కల్లు తాగిన స్వరూప (61) అనే వృద్ధురాలు మంగళవారం రాత్రి హోలిస్టిక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడంతో.. ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంత్యక్రియలు జరిపించేందుకు వారు ప్రయత్నించారు. కానీ, సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక.. ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన సీతారామ్‌ (47) బుధవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో, నారాయణ (54) అనే వ్యక్తిని కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్‌రావ్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. రాందేవ్‌రావ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మౌనిక (25) అనే మహిళ బుధవారం రాత్రి మృతి చెందారు. ఇలా నానాటికీ మృతుల సంఖ్య, ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో విషయం బహిర్గతమైంది.

బాధితుల గుర్తింపు.. కేసు నమోదు..

కల్తీ కల్లు కారణంగా ఆరుగురు చనిపోయిన నేపథ్యంలో.. బాధితులను గుర్తించేందుకు అధికారులు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి.. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి... ‘వారు కల్లు తాగారా? లేక ఇతర కారణాలతో అస్వస్థతకు గురయ్యారా?’ అని ఆరా తీస్తున్నారు. అలా 16 మందిని ఆస్పత్రికి పంపించారు. మరోవైపు.. బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు చింతకబడి నగేశ్‌ గౌడ్‌, బట్టి శ్రీనివాస్‌ గౌడ్‌, టి.శ్రీనివాస్‌ గౌడ్‌, కుమార్‌ గౌడ్‌, తీగల రమేశ్‌పై కేసు నమోదు చేశారు. నాలుగు కల్లు దుకాణాల్లో 674 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. సీతారామ్‌ భార్య అరుణ, స్వరూప కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రి పరామర్శ.. హెచ్చరిక

నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబాలను ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ బుధవారం పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి జూపల్లి.. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కల్తీ కల్లు విక్రయించిన వారు ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని, చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇక.. కల్తీ కల్లుకు బలైనవారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని ఈటల డిమాండ్‌ చేశారు. కాగా.. కల్తీకల్లు అమ్మకాలు జరిగినట్టు సమాచారం ఉన్న చోట్ల ఎక్సైజ్‌ అధికారులు నమూనాలను సేకరించి పరీక్షకు పంపినట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసిం తెలిపారు కల్తీ కల్లు సమస్యను అరికట్టడానికి రాష్ట్ర, జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీములు రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. అల్వాల్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ ఏ.ప్రశాంత్‌, మేడ్చల్‌ ఎస్‌వోటీ సీఐ శ్యామ్‌సుందద్‌రెడ్డి, మల్కాజిగిరి ఎక్సైజ్‌ సీఐ చంద్రశేఖర్‌, డీఐ తిమ్మప్ప ఆధ్వర్యంలో.. అల్వాల్‌ మండలంలోని 10 కల్లు దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. కల్లు నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు.

హెచ్‌ఆర్‌సీలో పిటిషన్‌

కల్తీ కల్లు కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల తరఫున.. ప్రముఖ న్యాయవాది రామారావు మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ వేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున.. తీవ్ర అనారోగ్యానికి గురైనవారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో నిరంతరం కల్లు కాంపౌండ్‌లలో తనిఖీలు చేయాలని, హెచ్‌ఎంటీ కాలనీ కల్లు కాంపౌండ్‌ను సీజ్‌ చేసి, వ్యాపార అనుమతులను వెంటనే రద్దు చేయాలని అభ్యర్థించారు.

చెట్లు లేకుండా కల్లు... పరీక్షించకుండానే విక్రయాలు

  • హైదరాబాద్‌ చుట్టపక్కల నాలుగు ఉమ్మడి జిల్లాల్లో తాడి చెట్లేలేవు

  • ఇతర జిల్లాల నుంచి లైసెన్స్‌లు

  • పట్టించుకోని ఆబ్కారీ శాఖ

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఒక్క తాటి చెట్టు లేదు.. నగరానికి చుట్టుపక్కల నాలుగు ఉమ్మడి జిల్లాల్లోనూ అదే పరిస్థితి అని ఎక్సైజ్‌శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయినా.. రోజూ లక్షల లీటర్ల కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. ఆ కల్లు ఎక్కడిది అంటే.. ఇతర జిల్లాల నుంచి తెస్తామంటూ లైసెన్స్‌లు పొంది విక్రయిస్తున్నది. కానీ.. ఆ జిల్లాల్లోనూ స్థానికంగానే ఎక్కువగా అమ్ముడుపోతుండటంతో.. మత్తు కోసం మోతాదుకు మించి హానీకరమైన రసాయనాలు కలిపి ఇక్కడ కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. మామూలుగా అయితే ఎక్సైజ్‌ శాఖ అధికారులు పరీక్షించిన తర్వాతే కల్లు విక్రయించాలని నిబంధనలు చెబుతున్నా.. అదంతా తూతూమంత్రంగానే సాగుతోంది. దీంతో తెలంగాణలో కల్తీ కల్లు ఏటా వందల కోట్ల రూపాయల వ్యాపారంగా మారి అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. నాయకులు, ప్రజాప్రతినిధుల సిండికేట్‌గా మారి కల్తీ కల్లు వ్యాపారం చేస్తున్నారనేవిమర్శలున్నాయి.

ఇదీ లెక్క...

రాష్ట్రంలో 4,064 తాటిసహకార సంఘాలు (టీసీఎస్‌) ఉండగా.. వాటి పరిధిలో 4697 కల్లు తయారీ కేంద్రాలున్నాయి. 1.95,391 మంది సభ్యులున్నారు. ఇక తాటిచెట్టుపైన కల్లు తీసి.. ఆ చెట్టుకిందనే విక్రయించుకోవడానికి ప్రభుత్వం ట్రీ ఫర్‌ ట్రేడ్‌ (టీఎ్‌ఫటీ) లైసెన్స్‌ ఇస్తుంది. ఆ లెసెన్సును ఆధారంగా చేసుకుని.. నిబంధనలకు విరుద్ధంగా కల్లు తయారీ కేంద్రాల నుంచి తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి లైసెన్స్‌లు పొందినవారు 29,272 మంది ఉండగా.. వారు 3,541 దుకాణాలు నడుపుతున్నారు. కల్లు విక్రయానికి డిమాండ్‌ అధికంగా ఉండటంతో ఉమ్మడి ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కల్తీ కల్లు తయారీ కేంద్రాలు అధికంగా విస్తరించాయి. ఒక్క తాటి, ఈత చెట్టు కూడా కనిపించని రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 100కు పైగా కల్లు విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఇలా లెక్కకు మిక్కిలిగా కల్లు దుకాణాలకు లైసెన్స్‌లు మంజూరు చేస్తున్న ఎక్సైజ్‌శాఖ ఆ తర్వాత ఎంత మాత్రం తనిఖీలు చేయట్లేదు. గత పదేళ్లుగా కల్లు దుకాణాలపై ఎక్సైజ్‌ శాఖ చేసిన దాడుల సంఖ్యను పరిశీలిస్తే.. ఆ సంఖ్య కూడా భారీగా తగ్గింది. అదే సమయంలో.. కల్తీ కల్లు విక్రయాలకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో డైజీపాం తయారు చేసే పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పెరిగాయి. వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు ఎక్కడికి వెళుతున్నాయనేదానిపై కూడా అధికారుల నిఘా లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 04:42 AM