iOS 26.2 update: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. కొత్త ఐఓఎస్ వచ్చేసిందిగా..
ABN, Publish Date - Dec 14 , 2025 | 07:39 AM
ఐఓఎస్ తాజా అప్‌డేట్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. మరి ఇందులోని ఫీచర్లు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ యూజర్లకు యాపిల్ సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. తాజాగా ఐఓఎస్ 26.2 వర్షన్‌ను విడుదల చేసింది. సాధారణ సమయం కంటే కాస్త ముందుగా, బోలెడన్నీ పర్సనలైజేషన్ ఫీచర్స్‌తో దీన్ని రిలీజ్ చేయడంతో ఐఫోన్ యూజర్లు ఫుల్లు ఖుష్ అవుతున్నారు.
2019 తరువాత రిలీజ్ అయిన అన్ని ఐఫోన్‌లకు ఈ అప్‌డేట్ వర్తిస్తుంది. అంటే, ఐఫోన్ 11 సిరీస్ మొదలు ప్రస్తుత టాప్ మోడల్స్ వరకూ అన్ని ఫోన్స్‌లో ఓఎస్ అప్‌డేట్ కానుంది. యూజర్లు తమ ఫోన్‌లోని సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్ ద్వారా దీన్ని ఎంచుకోవచ్చు. అయితే, వైఫై అందుబాటులో ఉన్న చోట, బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేశాక అప్‌డేట్ చేసుకోవాలని అనుభవజ్ఞులు సలహా ఇస్తున్నారు
యాపిల్ మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లకు కొత్త ఫీచర్స్
తాజా అప్‌డేట్‌తో యూజర్లు తమ సాంగ్స్ ప్లేలిస్టులోని నచ్చిన పాటను టాప్ పిక్‌గా సెట్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లేని సందర్భాల కోసం మ్యూజిక్ ప్లేబాక్‌లో ఆఫ్‌లైన్ లిరిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక పాడ్‌కాస్ట్స్‌ను ఇష్టపడే వారి కోసం ఆటో జెనరేటెడ్ చాప్టర్స్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో, పాడ్‌కాస్ట్‌లో తమకు నచ్చిన భాగాన్ని శ్రోతలు స్వేచ్ఛగా ఎంచుకుని వినొచ్చు.
లాక్ స్క్రీన్, సేఫ్టీ అలర్ట్
లాక్ స్క్రీన్‌కు సంబంధించి అందుబాటులోకి వచ్చిన కొత్త లిక్విడ్ గ్లాస్ స్లైడర్ ఆప్షన్‌తో యూజర్లు తమ లాక్ స్క్రీన్ పారదర్శకతను తమకు నచ్చిన మేరకు మార్చుకోవచ్చు. ఇక ఎమర్జెన్సీ అలర్ట్‌లకు సంబంధించి వాతావరణ మార్పులు, భద్రతకు సంబంధించినవి, అత్యవసర సమయాల్లో ఉపయోగించదగిన ఇంటరాక్టివ్ మ్యాపులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి మొదట యూఎస్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు.
ఇక గేమింగ్‌కు సంబంధించి రియల్ టైమ్ ఛాలెంజ్ స్కోరు బ్యానర్లు, ఎక్స్‌పాండెడ్ కంట్రోల్ సపోర్టును యాపిల్ జత చేసింది. సిస్టమ్ రెస్పాన్సివ్‌నెస్‌ను పెంచేలా మెరుగులు దిద్దింది. ఇక అలార్మ్‌లను లైవ్ యాక్టివిటీ ట్రాకింగ్‌తో అనుసంధానం చేయడం, మరింత ప్రైవసీ కోసం జోడించిన ఎయిర్ డ్రాప్ కోడ్స్ వంటివి కూడా యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. స్థూలంగా చూస్తే ఈ వర్షన్‌లో కొత్త ఫీచర్లు బోలెడన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
ఏఐతో ఉద్యోగాల కోతలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు
టెక్ రంగంలో భారత్ సార్వభౌమత్వం సాధించాలి: శ్రీధర్ వెంబు
Updated Date - Dec 14 , 2025 | 07:49 AM