Sridhar Vembu: టెక్ రంగంలో భారత్ సార్వభౌమత్వం సాధించాలి: శ్రీధర్ వెంబు
ABN , Publish Date - Dec 12 , 2025 | 09:41 PM
టెక్ రంగంలో భారత్ సార్వభౌమత్వం సాధించాలని జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. ఇందుకు భారత వ్యాపారవేత్తలు కంప్యూటర్ చిప్స్ తయారీపై దృష్టిపెట్టాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: టెక్ రంగంలో భారత్ సార్వభౌమత్వం సాధించాలని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు సూచించారు. సిలికాన్ వ్యాలీ విధానాలను అనుకరించాల్సిన అవసరం లేదని అన్నారు. తిరువనంతపురంలో జరిగిన హడల్ గ్లోబల్ స్టార్టప్ ఈవెంట్‌లో గురువారం పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సిలికాన్ వ్యాలీ వర్గాలకు భారత్ ఓ శిక్షణ క్షేత్రంగా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు (Sridhar Vembu Digital colonialism).
‘చివరకు మనం సిలికాన్ వ్యాలీకి అనుబంధంగా ఉండే టీమ్‌గా లేక వారి శిక్షణ క్షేత్రంగా మారిపోవచ్చు. మనం ముడిసరుకులు, లేదా మేధో సంపత్తిని చవకగా వారికి విక్రయిస్తాము. వారు మనకు ఖరీదైన తుది ఉత్పత్తులను ఇస్తారు. మౌలికంగా చూస్తే ఇది వలసవాద ఆర్థిక విధానం. క్రిటికల్ సాంకేతికతలపై మనం పట్టుసాధించకపోతే ఎప్పటికీ బందీలుగా మిగిలిపోతాము’
‘భారత్‌లో గత 30 ఏళ్లుగా వెంచర్ క్యాపిటల్ వ్యవస్థ ఉంది. కానీ మనం ఒక్క ప్రపంచస్థాయి సంస్థను కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాము. సిలికాన్ వ్యాలీ విధానాలను అనుకరించిన ఇతర అమెరికన్ ప్రాంతాలు కూడా ఆశించిన ఫలాలు పొందలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
సాంకేతికంగా సౌర్వభౌమత్వం సాధించేందుకు భారతీయ వ్యాపారవేత్తలు దేశీయంగా కంప్యూటర్ చిప్స్ తయారీపై దృష్టిపెట్టాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే ప్రస్తుతమున్న విధానాలను అధ్యయనం చేయాలని అన్నారు. ఈ డిజిటల్ వలసవాద జమానాలో ప్రపంచవ్యాప్తంగా ఆధునిక చిప్స్‌కు కొరత నెలకొన్న విషయాన్ని గుర్తు చేశారు.
‘భారత్ డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా 5 వేల చిప్స్‌కు మించి మనకు రావు. ఇదోరకమైన డిజిటల్ వలసవాదం’ అని అన్నారు. జీపీయూలల్లోని మౌలిక భాగాలు భారత్‌లోని నిపుణులు తయారు చేసినా భారత్‌కు అవి పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని అన్నారు.
ఇవీ చదవండి:
వివిధ దేశాల నుంచి భారతీయుల డిపోర్టేషన్.. వివరాలను వెల్లడించిన కేంద్రం
కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి