Sunrisers Hyderabad Defeat: మళ్లీ నిరాశపర్చిన సన్‌రైజర్స్
ABN, Publish Date - Apr 18 , 2025 | 03:06 AM
సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఓడింది, ముంబై ఇండియన్స్ చేతిలో ఐదవ ఓటమి చవి చూసింది. ఈ మ్యాచ్‌లో ముంబై 4 వికెట్లతో విజయం సాధించింది, విల్ జాక్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరచాడు
ఓటమి నెం.5
ముంబై విజయం
విల్ జాక్స్ ఆల్‌రౌండ్ షో
ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లోనే (575) వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా హెడ్. రస్సెల్ (545) ముందున్నాడు.
ముంబై: తాజా సీజన్‌లో పడుతూ.. లేస్తూ సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో ఐదో ఓటమి చేరింది. తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్‌పై 246 పరుగులను ఛేదించి అహో.. అనిపించిన రైజర్స్ వాంఖడేలో మాత్రం చెమటోడ్చింది. అటు బ్యాట్‌తోనూ ప్రభావం చూపలేక ఇటు బంతితోనూ రాణించలేక తమ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక సొంతగడ్డపై చెలరేగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో అలవోకగా నెగ్గింది. ఇది వారికి వరుసగా రెండో విజయం. సన్‌రైజర్స్ మాత్రం ఇతర వేదికలపై ఆడిన మూడింట్లోనూ ఓడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. అభిషేక్ (28 బంతుల్లో 7 ఫోర్లతో 40), క్లాసెన్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) రాణించగా, చివర్లో అనికేత్ (8 బంతుల్లో 2 సిక్సర్లతో 18 నాటౌట్) వేగం కనబర్చాడు. విల్ జాక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి నెగ్గింది. జాక్స్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36), రికెల్టన్ (23 బంతుల్లో 5 ఫోర్లతో 31), సూర్యకుమార్ (15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26), రోహిత్ (16 బంతుల్లో 3 సిక్సర్లతో 26) వేగంగా ఆడారు. కమిన్స్‌కు మూడు, ఎషాన్ మలింగకు రెండు వికెట్లు లభించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా జాక్స్ నిలిచాడు.
సమష్ఠి రాణింపుతో..: ముంబై ఇన్నింగ్స్ ఛేదనలో బరిలోకి దిగిన ప్రతీ బ్యాటర్ తమ వంతు ప్రయత్నంతో ఆకట్టుకున్నాడు. ఆరంభంలో ఓపెనర్ రోహిత్ మూడు సిక్సర్లతో జోష్‌లో కనిపించినా.. నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆరో ఓవర్‌లో రికెల్టన్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదగా పవర్‌ప్లేలో ముంబై 55/1 స్కోరుతో పటిష్ఠంగా కనిపించింది. అయితే హర్షల్ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లు బాది రికెల్టన్ అవుటవడంతో రెండో వికెట్‌కు జాక్స్‌తో కలిసి 37 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం జాక్స్-సూర్యకుమార్ జోడీ రైజర్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ ఒత్తిడి తగ్గించారు. అలాగే 11వ ఓవర్‌లో చెరో సిక్సర్‌తో జట్టు స్కోరు వంద దాటింది. అయితే మూడో వికెట్‌కు 52 పరుగులు జత చేరాక కమిన్స్ వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చాడు. కానీ హార్దిక్ (9 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21)-తిలక్ (17 బంతుల్లో 2 ఫోర్లతో 21 నాటౌట్)ల ఎదురుదాడితో రైజర్స్ చేసేదేమీ లేకపోయింది. 17వ ఓవర్‌లో హార్దిక్ 6,4తో సమీకరణం 18 బంతుల్లో 2 రన్స్‌కు మారింది. అయితే మలింగ తర్వాతి ఓవర్‌లో ఒకే రన్ ఇచ్చి హార్దిక్, నమన్ (0)ల వికెట్లను తీశాడు. చివరకు 19వ ఓవర్ తొలి బంతిని ఫోర్‌గా మలిచిన తిలక్ ముంబైని సంబరాల్లో ముంచాడు.
కట్టడి చేశారు: టాస్ ఓడిన సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్‌కు దిగడంతో భారీ స్కోరు ఖాయమేనా? అనిపించింది. కానీ పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో వారి ఇన్నింగ్స్ ఆద్యంతం నత్తనడకన సాగింది. ముంబై బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్లకు వీల్లేకుండా పోయింది. అయితే చివరి మూడు ఓవర్లలో 47 పరుగులు చేయడంతో జట్టు పోరాడే స్కోరందుకుంది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్లు అభిషేక్, హెడ్ అవుట్ కావాల్సి ఉన్నా ఫీల్లర్డు క్యాచ్ పట్టలేకపోవడంతో బతికిపోయారు. ఐదో ఓవర్‌లో అభిషేక్ హ్యాట్రిక్ ఫోర్ల కారణంగా పవర్‌ప్లేలో జట్టు 43 పరుగులతో నిలిచింది. అయితే ఉన్న కాసేపు కాస్త వేగం చూపిన అభిషేక్ 8వ ఓవర్‌లో హార్దిక్‌కు చిక్కడంతో తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ (2) స్టంపవుట్ కావడంతో పాటు బంతికో పరుగు చొప్పున ఆడిన హెడ్ (28) వెనుదిరగడంతో రైజర్స్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. మధ్య ఓవర్లలో ముంబైదే పూర్తి హవా సాగింది. క్లాసెన్ కూడా ఆదిలో ఇబ్బందిపడ్డాడు. అయితే నాలుగో వికెట్‌కు నితీశ్ (19)తో 31 పరుగులు జోడించాక క్లాసెన్ 18వ ఓవర్‌లో బ్యాట్ ఝుళిపించాడు. చాహర్ వేసిన ఈ ఓవర్‌లో వరుసగా 6,4,4,6తో 21 పరుగులు రాబట్టాడు. అయితే 19వ ఓవర్‌లో తొలి బంతికే క్లాసెన్‌ను బౌల్డ్ చేసిన బుమ్రా ఈ ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చాడు. కానీ ఆఖరి ఓవర్‌లో అనికేత్ 6,6, కమిన్స్ 6తో మరో 22 పరుగులు రాబట్టిన రైజర్స్ తమ స్కోరును 160 దాటించగలిగింది.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్: అభిషేక్ (సి/సబ్) బవ (బి) హార్దిక్ 40, హెడ్ (సి) శాంట్నర్ (బి) జాక్స్ 28, ఇషాన్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 2, నితీశ్ (సి) తిలక్ (బి) బౌల్ట్ 19, క్లాసెన్ (బి) బుమ్రా 37, అనికేత్ (నాటౌట్) 18, కమిన్స్ (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 162/5; వికెట్ల పతనం: 1-59, 2-68, 3-82, 4-113, 5-136; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-47-0, బౌల్ట్ 4-0-29-1, బుమ్రా 4-0-21-1, విల్ జాక్స్ 3-0-14-2, హార్దిక్ 4-0-42-1, శాంట్నర్ 1-0-8-0.
ముంబై: రికెల్టన్ (సి) హెడ్ (బి) హర్షల్ 31, రోహిత్ (సి) హెడ్ (బి) కమిన్స్ 26, విల్ జాక్స్ (సి) జీషన్ (బి) కమిన్స్ 36, సూర్యకుమార్ (సి) జీషన్ (బి) కమిన్స్ 26, తిలక్ (నాటౌట్) 21, హార్దిక్ (సి) ఇషాన్ (బి) మలింగ 21, నమన్ (ఎల్బీ) మలింగ 0, శాంట్నర్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 18.1 ఓవర్లలో 166/6; వికెట్ల పతనం: 1-32, 2-69, 3-121, 4-128, 5-162, 6-162; బౌలింగ్: షమి 3-0-28-0, కమిన్స్ 4-0-26-3, మలింగ 4-0-36-2, జీషన్ 3.1-0-35-0, హర్షల్ 3-0-31-1, రాహుల్ చాహర్ 1-0-9-0.
Updated Date - Apr 18 , 2025 | 03:12 AM