Nitish Kumar Reddy: తెలుగోడే కావాలంటున్న టీమిండియా కోచ్.. ఇదీ నితీష్ పవర్!
ABN, Publish Date - Jun 12 , 2025 | 02:51 PM
తెలుగు తేజం నితీష్ రెడ్డిలో అపూర్వ ప్రతిభ దాగి ఉందని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అన్నాడు. బ్యాటింగే కాదు.. బౌలింగ్‌లోనూ అతడు అద్భుతాలు చేయగలడని చెప్పాడు.
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. దొరికిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులా వినియోగించుకుంటున్నాడు. టెస్టులతో పాటు ఇతర ఫార్మాట్లలోనూ టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న నితీష్.. ఈ సిరీస్‌లో చెలరేగి ఆడాలని భావిస్తున్నాడు. ఐపీఎల్-2025 ఫెయిల్యూర్‌ను అందరూ మర్చిపోయేలా చేయాలని కసితో ఉన్నాడు. ఈ తరుణంలో అతడ్ని పొగడ్తల్లో ముంచెత్తాడు భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్. నితీష్‌లో అపూర్వ ప్రతిభ దాగి ఉందన్నాడు. బ్యాట్‌తోనే కాదు.. బంతితోనూ అతడు మ్యాజిక్ చేయగలడని తెలిపాడు. జట్టుకు తెలుగోడి అవసరం ఉందన్నాడు. మోర్కెల్ ఇంకా ఏమన్నాడంటే..
మ్యాజిక్ చేస్తాడా..?
‘నితీష్ రెడ్డిలో చాలా నైపుణ్యం దాగి ఉంది. అతడు బ్యాటింగే కాదు.. బౌలింగ్‌లోనూ సత్తా చాటగలడు. మ్యాజికల్ డెలివరీస్ వేసే టాలెంట్ అతడిలో ఉంది. అయితే నిలకడగా బంతులు వేయడం చాలా ముఖ్యం. నితీష్ నుంచి మేం అదే కోరుకుంటున్నాం. కెరీర్‌లో ఎదగాలంటే అతడికి కూడా అదే కీలకం. నితీష్‌తో తరచూ బౌలింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాం. సవాళ్లు సంధించే బంతులు వేయమని అతడ్ని చాలెంజ్ చేశా. అతడు తరచూ బౌలింగ్ చేయాలనేది నా కోరిక. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలిగే సామర్థ్యం ఉన్న నితీష్ లాంటి ప్లేయర్లు ఉండటం జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. బౌలింగ్‌లో అతడు మ్యాజిక్ చేస్తాడని నమ్ముతున్నా’ అని మోర్కెల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో తలపడే భారత జట్టు అన్ని విభాగాల్లోనూ సమతూకంగా ఉందని బౌలింగ్ కోచ్ పేర్కొన్నాడు. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నామని, అయితే వాటిని మైదానంలో ఎలా అమలు పరుస్తారనే దాని మీదే ఫలితం ఆధారపడి ఉంటుందన్నాడు మోర్కెల్.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 12 , 2025 | 03:04 PM