Total Solar Eclipse: ఖగోళంలో అద్భుతం.. వందేళ్లకు ఒక్కసారి మాత్రమే కనిపించే దృశ్యం
ABN, Publish Date - Jul 19 , 2025 | 09:11 PM
మరో రెండేళ్లల్లో ఖగోళంలో అద్భుత దృశ్యం సాక్షాత్కరించనుంది. శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సూర్యగ్రహణం కనిపించనుంది.
ఇంటర్నెట్ డెస్క్: మరో రెండేళ్లల్లో సంభవించనున్న సూర్యగ్రహణంపై ఖగోళ ఔత్సాహికుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. 2027 ఆగస్టు 2ను కనిపించనున్న ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఎదురు చూస్తున్నారు. ది గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్‌గా పిలిచే ఈ గ్రహణం సందర్భంగా 6 నిమిషాల 23 సెకెన్ల పాటు సూర్యుడు పూర్తిగా కనుమరుగు కానున్నాడు. మళ్లీ 2114 సంవత్సరంలోనే ఇంతటి సుదీర్ఘ సూర్యగ్రహణం చూసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే కనిపించే అద్భుత దృశ్యమని చెబుతున్నారు.
ఇండియాలో కనిపిస్తుందా..
ఉత్తర ఆఫ్రికా దేశాలు లిబియా, ఈజిప్టుల్లో ఈ అద్భుత దృశ్యాన్ని పూర్తిస్థాయిలో వీక్షించొచ్చు. భారతీయులు, ఇతర దక్షిణాసియా దేశాల వారు ఈ గ్రహణాన్ని చూడాలంటే ఆఫ్రికాకు వెళ్లాల్సిందే. తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర, దక్షిణ అమెరికాలో కూడా ఈ గ్రహణం కనిపించదు. సుడాన్‌లో పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడొచ్చు. మధ్యప్రాచ్యం, హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాల్లోని వారు కూడా పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఇక ఈజిప్టు, లిబియా దేశాల్లో పొడి వాతావరణం ఉండటంతో సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. సూర్యుడిని అధ్యయనం చేసే పరిశోధకులకు ఇదో అద్భుత అవకాశం.
చరిత్రలో ఇది అత్యంత సుదీర్ఘ సూర్యగ్రహణం కాకపోయినప్పటికీ ఈ శతాబ్దపు అతి ముఖ్య గ్రహణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1991-2114 మధ్య సంభవించే గ్రహణాల్లో మాత్రం ఇదే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం. క్రీస్తుపూర్వం 743లో గ్రహణం సందర్భంగా సూర్యుడు ఏకంగా ఏడు నిమిషాల 28 సెకెన్ల పాటు కనుమరుగయ్యాడు. చరిత్రపుటల్లోకెక్కిన అత్యంత సుదీర్ఘ సూర్యగ్రహణంగా ఇది పేరు గాంచింది.
ఇవీ చదవండి:
జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్
22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..
Updated Date - Jul 19 , 2025 | 09:32 PM