Life in Europe: జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:54 PM
ఐరోపాలో జీవన శైలి ఎలా ఉంటుందో చెబుతూ ఓ ఎన్నారై పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అన్నీ తరచి చూసుకున్నాకే యూరప్‌కు రావాలో వద్దో నిర్ణయించుకోవాలని ఆయన భారతీయులకు సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐరోపాలో మంచి జీవితం కోసం అనేక మంది భారతీయులు అక్కడకు క్యూ కడుతుంటారు. కానీ వాస్తవంలో అక్కడి లైఫ్ అందరికీ సరిపడకపోవచ్చంటూ ఓ ఎన్నారై పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దేవ్ అనే టెకీ ఈ పోస్టును షేర్ చేశారు. యూరప్‌కు రావాలనుకుంటున్న వారు అన్ని విషయాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
వర్క్ పర్మిట్ ముగిశాక వారం రోజుల్లోపు కొత్త జాబ్ దొరక్కపోతే వెంటనే భారత్‌కు తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. అక్కడ ఎంత కాలం పనిచేసినా.. ఎంత పన్ను చెల్లించినా ఉపయోగం ఉండదని చెప్పుకొచ్చారు. అక్కడి వ్యవస్థ జాబ్స్ తో ముడిపడి ఉందని అన్నారు. ఇక అక్కడ తీసుకునే జీతాల్లో 30 నుంచి 50 శాతం పన్ను కింద పోతుందని తెలిపారు. దీనికి అధిక ఇళ్ల అద్దెలు, పచారీ సామాన్ల ఖర్చులు వంటివి కలుపుకుంటే తడిసి మోపెడవుతుందని తెలిపారు.
ఐరోపాలో వాతావరణం కూడా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. ఎండాకాలంలో రోజుకు 24 గంటలు ఎండ కాస్తుందని, చలికాలంలో దాదాపు నాలుగు నెలల పాటు సూర్యుడే కనిపించడని తెలిపారు.
స్వతంత్ర జీవనానికి ఇష్టపడే ప్రజలు, వాతావరణ పరిస్థితులు వెరసి అక్కడ ఒంటరితనం బారినపడాల్సి వస్తుందని అన్నారు. నెల రోజులకు సరిపడా ఇంటికి సామాన్లు తెచ్చుకునే జనాలు ఆ తరువాత ఇంట్లోంచి బయటకే రారని అన్నారు. సామాజిక సంబంధాలు తక్కువగా, డిప్రెషన్ కలిగించేలా ఉంటాయని వెల్లడించారు. అలాంటి సందర్భాల్లో కచ్చితంగా భారత్‌లో బంధుమిత్రులు, స్నేహితులు గుర్తొచ్చి మనసు మరింత ఇబ్బంది పెడుతుందని అన్నారు. కుటుంబానికి దూరంగా ఉండటంతో భావోద్వేగ మద్దతు కూడా ఉండదని తెలిపారు. కాబట్టి, ఇక్కడి పరిస్థితులకు పూర్తిగా ఆకళింపు చేసుకున్నాకే రావాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. జనాల్లో అనేక మంది అతడి అభిప్రాయంతో ఏకీభవించారు.
ఇవీ చదవండి:
ఈ పని మాత్రం అస్సలు చేయొద్దు.. హెచ్1బీ వీసాదారులకు నెటిజన్ సూచనపై పెద్ద చర్చ
ఇలాంటి మోసం మీరెక్కడా చూసుండరు.. దుస్తుల షాపులోకి దూరిన దొంగ..