ఇండోర్ జలపాతం చూసోద్దాం పదండీ..
ABN, Publish Date - Apr 20 , 2025 | 12:44 PM
కొండలపై నుంచి జాలువారే జలపాతాలను చూసి ఉంటారు. చైనాలో నిర్మించిన కృత్రిమ జలపాతం గురించి కూడా వినే ఉంటారు. కానీ ఇండోర్ జలపాతాన్ని ఎక్కడైనా చూశారా.. అయితే అదేంటో.., దాని విశేషాలేంటో చూసోద్దాం పదండి మరీ..
సింగపూర్‌లో ‘ద రెయిన్ వర్టెక్స్’ పేరుతో 130 అడుగుల ఎత్తైన ఇండోర్ జలపాతాన్ని ఏర్పాటు చేశారు. అద్దాల మేడలో జాలువారే ఆ జలపాతం ఇప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది.
పర్యాటకులను ఆకర్షించాలంటే కళ్లు చెదిరే నిర్మాణాలు ఉండాలి. కనువిందు చేసేలా కొత్తగా డిజైన్ చేయాలి. ఆ కోవ లోనే సింగపూర్ ప్రభుత్వం ‘జెవెల్ చాంగి ఎయిర్‌పోర్టు’లో ఒక ఇండోర్ జలపాతాన్ని నిర్మించింది. ‘ద రెయిన్ వర్టెక్స్’ పేరుతో నిర్మించిన ఈ జలపాతం విమానాశ్రయం లోకి అడుగుపెట్టిన ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 130 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ఆద్యంతం కనువిందు చేస్తోంది. విమానా శ్రయంలో వెయిటింగ్ ప్రదేశంలో... ప్రయాణికులను అలరించేందుకు ఈ కృత్రిమ జలపాతాన్ని కళాత్మకంగా సృష్టించారు.
లైటింగ్ ప్రత్యేకం...
ఇండోర్ జలపాతం అందాలు పగటి పూట ఉల్లాసభరితంగా ఉంటే... రాత్రివేళ దాని అందం మరింత ద్విగుణీకృతమవు తుంది. ప్రత్యేకమైన లైటింగ్ ఎఫెక్టులతో జలపాతం కనువిందు చేస్తుంది. అద్భుత మైన లైట్ అండ్ సౌండ్ షోగా దీన్ని రూపొందించారు. వాటర్‌ఫాల్ పైన ఉక్కు, గాజుతో నిర్మించిన పైకప్పు 656 అడుగుల్లో విస్తరించి ఉంటుంది. దీన్ని మందపాటి గాజుతో నిర్మించారు. విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో వెలువడే శబ్ధాలను ఇది గ్రహిస్తుంది. శబ్ధాలను లోపలికి రానివ్వదు. ఈ వాటర్‌ఫాల్‌ని ‘సఫ్డీ ఆర్కిటెక్ట్స్’ అనే సంస్థ డిజైన్ చేసింది. ప్రయాణికులను ఆకర్షించేందుకు నిర్మించిన ఈ వాటర్‌ఫాల్ ఎయిర్‌పోర్ట్, సింగపూర్‌కు ఒక విశేష ఆభరణంగా గుర్తింపు పొందింది.
ఏడంతస్తుల భవనమంత ఎత్తు నుంచి నిరంతరం నీరు జాలువారుతూ ఉంటుంది. సింగపూర్‌లో తరచుగా వర్షాలు పడుతుంటాయి. వర్షపు నీరంతా ఒక చోట చేరి జలపాతంలా పడేలా తీర్దిదిద్దారు. నిమిషానికి 10 వేల గ్యాలన్ల నీరు పంప్ చేసే విధంగా దీన్ని నిర్మించారు. జలపాతం చుట్టూ 200 రకాల జాతుల మొక్కలను ఏర్పాటు చేశారు. దాంతో ఒక చిట్టడవిలో నిలబడి జలపాతాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. టెర్రస్ గార్డెన్‌ను ‘షిసిడో ఫారెస్ట్ వ్యాలీ’ అని పిలుస్తారు. కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం వేచి చూసే ప్రయాణికులకు ఈ వర్టెక్స్ సరికొత్త అనుభూతిని పంచుతోంది. సింగపూర్‌కు వెళ్లిన వారు తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది.
ఈ వార్తలు కూడా చదవండి
పేరు రావాలన్నా పోవాలన్నా మీదే బాధ్యత
చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..
సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త
Read Latest Telangana News and National News
Updated Date - Apr 20 , 2025 | 12:44 PM