Viral News: పాకిస్తాన్ నటికి భారత అభిమాని గిఫ్ట్.. వీడియో వైరల్..
ABN, Publish Date - Apr 30 , 2025 | 04:11 PM
పహల్గామ్ దాడి తర్వాత భారత్ మొత్తం పాకిస్తాన్ పై కోపంగా ఉంది. కానీ ఓ భారత అభిమాని మాత్రం పాకిస్తాన్ నటి కోసం వాటర్ బాటిళ్ల బాక్స్ పంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌పై అనేక చర్యలు తీసుకుంది. అందులో 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం కూడా ఉంది. పాకిస్తానీలు ప్రధానంగా ఈ నీటిపై ఆధారపడి జీవిస్తారు. కానీ ఈ ఒప్పందం ప్రస్తుతం రద్దు కావడంతో వారికి నీరు ఎలా అనే పరిస్థితి మొదలైంది. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
తొలి పాకిస్తానీ సెలబ్రిటీ
పహల్గామ్ దాడిపై స్పందించిన మొదటి పాకిస్తానీ సెలబ్రిటీలలో పాకిస్తానీ బ్యూటీ హనియా ఆమిర్ కూడా ఉన్నారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బాధను వ్యక్తం చేస్తూ, ఎక్కడ విషాదం జరిగినా, అది మనందరికీ విషాదమే' అని రాసుకొచ్చారు. అమాయక ప్రాణాలు కోల్పోయినప్పుడు, ఆ బాధ వారిది మాత్రమే కాదు, అది మనందరికీ చెందినది. మనం ఎక్కడి నుంచి వచ్చినా, దుఃఖానికి ఒకే భాష ఉంటుందన్నారు. మనం ఎల్లప్పుడూ మానవత్వాన్ని కల్గి ఉండాలని కోరారు. ఈ పోస్ట్ చూసిన అనేక మంది ఈ పాకిస్తాన్ నటికి అభిమానులుగా మారిపోయారు.
సోషల్ మీడియాలో వైరల్
ఇదే సమయంలో పలువురు ఈ నటికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. మరికొంత మంది ఆ పోస్టును లైక్ చేస్తూ, షేర్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఓ భారత అభిమాని మాత్రం ఆమెకు వినూత్నంగా ధన్యవాదాలు తెలియజేశాడు. ఎలాగంటే ఆమెకు వాటర్ బాటిళ్లతో నిండిన ఓ పెట్టెను ఇండియా నుంచి పాకిస్తాన్ పంపించినట్లుగా ఉంది. దానిపై 'హనియా ఫర్ అమీర్' అని రాసి ఉంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను హనియా అమీర్ భారతీయ అభిమానులు తయారు చేశారని చెబుతున్నారు. ఇది చూసిన చాలా మంది నవ్వుకుంటుండగా, మరి కొంతమంది నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సర్దార్ జీ 3 నుంచి హరియా
హనియా అమీర్ 'సర్దార్ జీ 3' చిత్రంలో దిల్జిత్ దోసాంజ్ తో కలిసి కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. పహల్గామ్ దాడి తర్వాత ఆ సినిమా నుంచి ఆమెను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 'సర్దార్ జీ 3' నిర్మాతల నుంచి మాత్రం అధికారికంగా ధృవీకరణ లేదు. ఏప్రిల్ 22న, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులను వారి మతం గురించి అడిగిన తర్వాత ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
RRBs: ఈ 15 బ్యాంకులు మే 1 నుంచి బంద్.. మీ డబ్బు భద్రమేనా..
Central Government: జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 30 , 2025 | 04:14 PM