Excessive Holidays: భారత్‌లో సెలవులు తగ్గించాలన్న సీఈఓ.. జనాల రెస్పాన్స్ ఇదే
ABN, Publish Date - Apr 22 , 2025 | 07:08 AM
దేశంలో అధికంగా ఉన్న సెలవులు తగ్గించాలంటూ ఓ సీఈఓ చేసిన సూచనపై ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వంలో సెలవులు ఎక్కువైపోవడంతో ఒక్క పని కూడా తీరుగా జరగట్లేదంటూ క్లీన్‌రూమ్స్ కంటెయిన్‌మెంట్స్ సంస్థ సీఈఓ రవికుమార్ లింక్డ్‌ఇన్‌లో ఓ సంచలన పోస్టు పెట్టారు. అధిక సెలవుల కారణంగా ఉత్పాదకత తగ్గిపోతోందన్న ఆయన సెలవులను కుదించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వారాంతాలు, ఐచ్ఛిక సెలవులు కూడా కలుపుకుంటే ఏప్రిల్‌లో 10 రోజులు సెలవలని, దీని వల్ల ఉత్పాదకత తగ్గి ఎమ్ఎస్ఎమ్‌ఈల వంటి సంస్థలపై ప్రతికూల ప్రభావం పడుతోందని అన్నారు. ఇలాంటి ఆటంకాలు అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరపతికి హాని చేస్తాయని తెలిపారు. ఆర్థికాభివృద్ధికి చైనా ప్రాధాన్యం ఇవ్వడంతో భారత్ కంటే 60 ఏళ్ల ముందు ఉందని తెలిపారు.
ఆయన పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు రవి కుమార్ సూచనతో ఏకీభవిస్తే మరికొందరు మాత్రం విభేదించారు. సెలవుల సంఖ్య రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుందని, వీటిల్లో కొన్ని ఐచ్ఛిక సెలవులు కూడా ఉంటాయని తెలిపారు. వారానికి ఐదు పనిదినాల విధానాన్ని అనుసరించే కార్పొరేట్ కంపెనీలు .. అన్ని సెలవులను పాటించవని కూడా కొందరు గుర్తు చేశారు. చైనాతో పోల్చడం సరికాదని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. అక్కడి కార్మిక చట్టాలు, ప్రభుత్వ నియంత్రణ భిన్నంగా ఉంటుందని గుర్తు చేశారు. భారత్‌లో పరిస్థితులకు అనువైన ప్రత్యామ్నాయాలు కనుగొనాలని అన్నారు. అధికార యంత్రాంగంలో లోపాలే ఉత్పాదకతకు పెద్ద ఆటంకమని మరికొందరు తెలిపారు.
ఈ సమస్య పరిష్కారానికి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అనేక మంది సూచించారు. భారత సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తూనే సెలవులను తగ్గించొచ్చని అన్నారు. వారానికి ఐదు పనిదినాలను కచ్చితంగా అమలు చేస్తూ ఇతరత్రా సెలవులను తగ్గించుకోవచ్చని చెప్పారు. ఉద్యోగుల మానసిక శారీర ఆరోగ్యం కోసం జీతంతో కూడిన సెలవులు కూడా మంజూరు చేయాలని అన్నారు ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..
అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు
వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..
Updated Date - Apr 22 , 2025 | 07:08 AM