Shubhanshu Shukla to Visit ISS: వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..
ABN , Publish Date - Apr 18 , 2025 | 07:48 PM
భారతీయ ఆస్ట్రొనాట్ శుభాంశూ శుక్లా త్వరలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. స్పేస్ ఎక్స్ ద్వారా నిర్వహించనున్న ఈ మిషన్ కోసం ఇస్రో 60 మిలియన్ డాలర్లు చెల్లించనుంది.
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ మిషన్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. గగన్‌యాన్ యాత్రికుడు, భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశూ శుక్లా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. అంతర్జాతీయ స్పేస్ మిషన్‌లో భాగంగా శుభాంశూ శుక్లా ఇంటర్నేషనల్ స్పేషన్ స్టేషన్‌ను సందర్శిస్తారని వెల్లడించారు.
గగన్‌యాన్ మిషన్ కోసం గ్రూప్ కెప్టెన్ శుక్లా ప్రస్తుతం నాసాతో పాటు ప్రైవేటు సంస్థ యాక్సియమ్ స్పేస్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విషయం తెలిసిందే. గత ఎనిమిది నెలలుగా ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఇక తాజాగా ప్రైవేటు వాణిజ్య అంతరిక్ష యాత్రలో భాగంగా ఆయన స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. ఈ యాత్ర కోసం భారత్ 60 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించింది.
స్పేఎక్స్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్‌తో ఈ మిషన్ నిర్వహించనున్నారు. క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో శుభాంశు అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగం నిర్వహిస్తారు. గగన్‌యాన్ మిషన్ కోసం ఇస్రో శుక్లాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇస్రో ఎంపిక చేసిన వారిలో అత్యంత పిన్న వయస్కుడైన శుక్లా వయసు 40 ఏళ్లు. ‘‘వచ్చే నెల భారతీయ ఆస్ట్రొనాట్ అంతర్జాతీయ మిషన్‌లో భాగంగా స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌కు ఇదో కీలక మైలురాయి కానుంది’’ అని కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ఉపగ్రహ ప్రయోగాల్లో ఆరితేరిపోయిన ఇస్రో తన తదుపరి మజిలీగా గగన్‌యాన్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా భారతీయ వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చి మళ్లీ సురక్షితంగా భూమికి చేర్చేందుకు ఇస్రో ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో మానవ వినియోగానికి అనుకూలంగా రూపొందించిన హెచ్‌ఎల్ఎమ్‌వీ 3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. రెండు భాగాలున్న ఈ రాకెట్‌లో మొదటిదైన క్రూ మాడ్యూల్‌లో వ్యోమగాములు కూర్చుంటారు. రెండో భాగంలో రాకెట్ ఇంజెన్, ఇంధనం తదితరాలు ఉంటాయి. అత్యవసర సందర్భా్ల్లో వ్యోమగాములను కాపాడేందుకు క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను కూడా ఇస్రో సిద్ధం చేసింది. 2026లో ఈ మిషన్ నిర్వహించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
Chhattisgarh: లొంగిపోయిన 33 మంది నక్సల్స్
బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్
ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ