Dutch Man: ఇంతలా నన్ను అవమానిస్తారా.. ఇంకెప్పుడూ ఇండియాకు రాను: నెదర్‌లాండ్స్ పౌరుడు
ABN, Publish Date - Jun 27 , 2025 | 09:06 AM
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫ్రెండ్ ఓ మైనర్ బాలిక అని తెలీక ఆమె కోసం ఇండియాకొచ్చిన నెదర్‌లాండ్స్ జాతీయుడు చిక్కుల్లో పడ్డాడు. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఈ ఉదంతం వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫేస్‌బుక్‌లో తనకు పరిచయమైన స్నేహితురాలు మైనర్ అని తెలీక ఓ నెదర్‌లాండ్స్ జాతీయుడు ఇక్కట్ల పాలయ్యాడు. ఆమె కోసం భారత్‌కు వచ్చి చిక్కుల్లో పడ్డ అతడు తన పరువు పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది (Dutch Man in West Bengal).
అమ్‌స్టర్‌డామ్‌కు చెందిన హెండ్రిక్స్‌కు సోషల్ మీడియాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలిక పరిచయమైంది. ఆమె మైనర్ అన్న విషయం అప్పటికి అతడికి తెలియదు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం మొదలైంది. చివరకు అతడు ఆమెను కలుసుకునేందుకు గత ఆదివారం భారత్‌కు వచ్చేశాడు. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో దిగిన అతడు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాడియా జిల్లాలోని మాయాపూర్‌కు చేరుకున్నాడు. అక్కడ ఓ హోటల్‌లో బస చేసిన అతడు ఆ తరువాత బస్సు ద్వారా తేహట్టా గ్రామానికి వెళ్లాడు. స్థానికంగా ఓ హైస్కూల్ వద్దకు వెళ్లాక అక్కడి నుంచి ఎటు వెళ్లాలో అతడికి తెలియరాలేదు. తన స్నేహితురాలి అడ్రస్ తెలియక కొన్ని గంటలపాటు అక్కడే తచ్చాడుతూ తిరిగాడు.
తేహట్టా ఓ కుగ్రామం. అక్కడ విదేశీయుల రాక బహు అరుదు. దీంతో, హెండ్రిక్స్ తీరు స్థానికులకు అనుమానాస్పదంగా కనిపించింది. ఆరు గంటల పాటు అతడు అక్కడే ఉండటంతో జనాలకు అనుమానాస్పందగా అనిపించి అతడిని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. పూర్తి అడ్రస్ తెలియకున్నా స్నేహితురాలిని కలిసేందుకు వచ్చానని అతడు చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోపు బాలిక తండ్రికి కూడా ఈ విషయం తెలిసింది. ఓ విదేశీయుడు తన కూతురి కోసం వచ్చాడని తెలిసి కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు హెండ్రిక్స్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్ ఇన్‌చార్జ్ అతడిని ప్రశ్నించారు.
‘విచారణ సందర్భంగా అతడి విషయంలో అనుమానించాల్సింది ఏదీ కనిపించలేదు. ఒక విదేశీయుడిగా అతడితో మర్యాదగా వ్యవహరించాము. కానీ బాలిక తండ్రి మాత్రం అతడిని తన కూతురితో మాట్లాడేందుకు ఒప్పుకోలేదు. బాలిక మైనర్ కావడంతో మేము అతడికి విషయం చెప్పాము. వెరిఫికేషన్ మొత్తం పూర్తయ్యాక అతడిని సగౌరవంగా పంపించేశాము’ అని స్టేషన్ ఇన్‌చార్జ్ పేర్కొన్నారు.
ఈ అనుభవం తనకు భారీ షాకిచ్చిందని హెండ్రిక్స్ అన్నాడు. ‘నేనేమీ సెన్సేషన్ కోసమో ప్రచారం కోసమో ఇలా చేయలేదు. ఓ ఫ్రెండ్‌ను కలిసేందుకు ఇక్కడకు వచ్చాను. అంతే. కానీ ఇదంతా నాశనమైంది. ఇక్కడ నాకు సరైన ఆతిథ్యం లభించలేదు. అవమానంగా ఫీలయ్యాను. పరువు పోయినట్టు ఫీలయ్యాను. తేహట్టా జనాలు అసలేమాత్రం జాలి చూపలేదు. మరో ఆలోచన లేకుండా క్షణాల్లో జీవితాలను నాశనం చేయగలరు. విదేశీయులందరితో ఇలాగే వ్యవహరిస్తే ఇక భవిష్యత్తుపై ఆశలు వదులుకోవాల్సిందే. నేను రేపు వెళ్లిపోతాను. ఇంకెప్పుడూ ఇండియాకు రాను’ అని హెండ్రిక్స్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఇన్సూరెన్స్ డబ్బు కోసం రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు.. ఇదేం తెలివి బ్రో..
ఇదేం చికిత్స తల్లీ.. కళ్లను మూత్రంతో శుభ్రం చేసుకుంటున్న మహిళ
Updated Date - Jun 27 , 2025 | 01:35 PM