Chatgpt Salt Alternative: చాట్‌జీపీటీ చెప్పిన సలహాను 3 నెలల పాటు పాటించడంతో భారీ షాక్
ABN, Publish Date - Aug 11 , 2025 | 09:10 PM
ఉప్పుకు బదులు చాట్‌జీపీటీ చెప్పిన సోడియం బ్రోమైడ్‌ను వాడి ఆసుపత్రి పాలయ్యాడో వ్యక్తి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వాషింగ్టన్ యూనివర్సిటీ వైద్యులు ఓ మెడికల్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆహార నియమాల విషయంలో చాట్‌జీపీటీ సలహాను ముందూవెనుకా ఆలోచించకుండా ఫాలో అయిన ఓ వ్యక్తి భారీ ప్రమాదంలో పడ్డాడు. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు ఓ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు.
వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం, సదరు వ్యక్తి ఉప్పుతో ముప్పు తప్పదని భయపడిపోయాడు. ఉప్పుకు ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని చాట్‌జీపీటీని సలహా అడిగాడు. సాధారణ ఉప్పుకు బదులు సోడియం బ్రోమైడ్‌ను వాడొచ్చని చాట్‌జీపీటీ సలహా ఇచ్చింది. దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను మాత్రం వెల్లడించడంలో విఫలమైంది. దీంతో, సదరు వ్యక్తి మూడు నెలల పాటు ఉప్పుకు బదులుగా సోడియం బ్రోమైడ్‌ను వాడి ఊహించని ప్రమాదంలో పడ్డాడు.
సోడియం బ్రోమైడ్ వాడటం మొదలెట్టిన కొన్ని రోజులకు అతడిలో అనారోగ్యం మొదలైంది. కన్ఫ్యూజన్‌తో మొదలైన వ్యవహారం చివరకు లేని పోని భ్రమల వరకూ వెళ్లింది. మానసిక సంతులనం తప్పడంతో అతడు ఇరుగుపొరుగు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గోల చేయడం ప్రారంభించాడు. నీళ్లను కూడా అనుమానించడం మొదలెట్టాడు. దాహం వేస్తున్నా కూడా అనవసర భయాలతో చుక్క నీరు కూడా తాగకుండా భీష్మించుకుని కూర్చుండిపోయేవాడు. దీంతో, అతడి ఆరోగ్యం బాగా దిగజారింది. చివరకు అతడు ఆసుపత్రిపాలు కావాల్సి వచ్చింది.
డాక్టర్లు అతడికి ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీసైకోటిక్ డ్రగ్స్‌తో చికిత్స ప్రారంభించారు. అలా కొన్ని రోజుల పాటు ఐసీయూలో ఉన్నాక అతడి ఆరోగ్యం మెరుగుపడింది. మానసిక సమస్యలు తొలగిపోయాయి. పూర్తిగా తేరుకున్నాక అసలు ఏమైందో అతడు వైద్యులకు వివరించారు. చాట్‌జీపీటీతో అతడి చాటింగ్ హిస్టరీ అప్పటికే డిలీట్ అయిపోయింది. దీంతో, వైద్యులు మరోసారి సోడియం బ్రోమైడ్ ప్రశ్నలను చాట్‌జీపీటీపై సంధించగా అది ఉప్పునకు మంచి ప్రత్యామ్నాయం అని చాట్‌జీపీటీ చెప్పుకొచ్చిందట.
బ్రోమైడ్ ఆధారిత రసాయనాలతో నిద్రలేమి, ఆందోళన వంటి మానసిక సమస్యలు మొదలవుతాయి. కాబట్టి వైద్యులు ఎప్పుడో దీని వాడకాన్ని నిషేధించారు. ప్రస్తుతం వెటర్నరీ వైద్యులు మాత్రమే దీన్ని పశువుల కోసం ఉపయోగిస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు కూడా సోడియం బ్రోమైడ్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరమైన సలహాల కోసం కేవలం వైద్యులనే సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఏఐ సలహాలతో సొంత వైద్యం వద్దని హితవు పలుకుతున్నారు. ఏఐ ఇచ్చిన వైద్య సలహా వికటించడం ఇదే తొలిసారని కూడా కొందరు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
భారత్‌లోని ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్.. ఇక్కడి వారు ఎంత రిచ్ అంటే..
నాలుగు దశాబ్దాలుగా రోజూ 10 గంటల పాటు భిక్షాటన.. ఇతడి ఆస్తి ఎంతో తెలిస్తే..
Updated Date - Aug 11 , 2025 | 09:41 PM