Health Tips: ఈ 5 ప్రదేశాల్లో నొప్పిగా ఉందా.. అయితే మీ కిడ్నీలు జాగ్రత్త..
ABN, Publish Date - Aug 26 , 2025 | 09:17 AM
మన శరీరంలో మూత్రపిండాలు ఎంతో కీలకమైన అవయవం. రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటూ నీరు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడడం, రక్తపోటును నియంత్రించడం వంటి పనులన్నీ చేసేస్తుంది. అయితే..
మన శరీరంలో మూత్రపిండాలు ఎంతో కీలకమైన అవయవం. రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటూ నీరు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడడం, రక్తపోటును నియంత్రించడం వంటి పనులన్నీ చేసేస్తుంది. అయితే కొన్ని అలవాట్లు వాటిని దెబ్బతీస్తుంటాయి. మూత్రపిండాలు దెబ్బతినే ముందు కొన్ని సంతేతాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నడుము దిగువ భాగంతో పాటూ పక్కటెముకలు, తుంటి మధ్య పార్శ్వ ప్రాంతంలో నొప్పి వస్తుంటే జాగ్రత్త పడాలి. ఉన్నట్టుండి ఎవరో కత్తితో పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంది. ఇలా తరచూ అనిపిస్తుంటే వైద్యుడిని సంప్రదించాలి.
మూత్రపిండాల్లో రాళ్లు, మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉన్న సమయంలో నొప్పి ఎక్కువై వీపు వరకూ వ్యాపిస్తుంది. కొన్నిసార్లు ఈ నొప్పిని చాలా మంది కండరాల నొప్పి అనుకుని తేలిగ్గా తీసుకుంటుంటారు. ఇలా నొప్పి తగ్గకుండా వస్తుంటే మూత్రపిండాల సమస్యగా భావించాలి.
పొత్తికడుపు తిమ్మిరి, బరువుగా అనిపించడంతో పాటూ ఉన్నట్టుండి ఎక్కవ నొప్పి పుట్టడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాగే వికారంతో పాటూ పొత్తికడుపుపై ఒత్తిడి, కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు , ఇన్ఫెక్షన్ తలెత్తినప్పుడు ఇలా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యం ఉండడంతో పాటూ ఉన్నట్టుండి మూత్రం చేయాలని అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు మూత్రపిండాల వల్ల కలిగే నొప్పి గజ్జలు, కటి ప్రాంతానికి వ్యాపిస్తుంది.
కాళ్లు, చీలమండలు, పాదాల్లో నొప్పితో పాటూ వాపు వస్తుంది. అలాగే తొడలలో తిమ్మిర్లు, చీలమండలు, పాదాలలో వాపు, మంటతో పాటూ జలదరింపు కనిపిస్తున్నా కూడా జాగ్రత్తపడాలి.
మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్‌తో పాటూ అధిక రక్తపోటు కారణంగా ఛాతీ, పక్కటెముకల ప్రాంతంలో నొప్పి పుడుతుంది. ఇలా పదే పదే అనిపిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి.
Updated Date - Aug 26 , 2025 | 09:17 AM