Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు..
ABN, Publish Date - Oct 26 , 2025 | 04:32 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక ఆదివాసి చెంచుల వివాహాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్టు దేవ్ వర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు వనవాసీ కళ్యాణ పరిషత్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో 111 జంటలు ఒక్కటయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఆదివాసి చెంచుల వివాహాలు జరిగాయి.
ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు వనవాసీ కళ్యాణ పరిషత్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
2021లో 140 జంటలకు ఇలాగే వివాహం జరిపించారు. ఈ సారి అంటే.. నేడు 111 జంటలకు వివాహం జరిపించారు.
ఈ వివాహం అనంతరం గవర్నర్ ఆశీస్సులను ఈ జంటలు అందుకున్నారు. అంతకు ముందు అచ్చంపేట చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
కొవిడ్ సమయంలో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో.. దాతల సహకారంతో చెంచులకు నిత్యవసర వస్తువులను అందించారు. ఆ సమయంలో చాలా మంది వివాహాలు చేసుకోకుండా.. సహజీవనం చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని వనవాసీ కల్యాణ పరిషత్తు పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లారు. దాంతో వారు స్పందించి.. దాతల సహకారంతో 2021 అక్టోబర్ 30న అచ్చంపేటలో 140 జంటలకు వివాహాలు జరిపించారు.
దీనికి ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివాహానికి అవసరమైన వస్తువులను ఈ పరిషత్ వారు అందజేశారు.
ఈ సామూహిక వివాహాలకు సుమారు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని పరిషత్ నిర్వాహకులు తెలిపారు.
నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన జంటలకు వివాహం జరిపించినట్లు వెల్లడించారు.
నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన చెంచు యువకుడు ఒడిశాకు చెందిన ఒక చెంచు యువతిని ప్రేమించాడు. వారికి సైతం ఈ కార్యక్రమంలో వివాహం జరిగింది.
ఈ సామూహిక వివాహా కార్యక్రమానికి దాదాపు రెండు వేల మంది హాజరయ్యారని నిర్వాహకులు చెప్పారు.
ఈ కార్యక్రమానికి గవర్నర్ వస్తున్న నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated Date - Oct 27 , 2025 | 10:39 AM