Parents Teacher Meeting: మెగా పీటీఏం 2.0లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్
ABN, Publish Date - Jul 10 , 2025 | 07:01 PM
పాఠశాలలు పవిత్ర దేవాలయాలు.. మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఝానాన్ని అందించే పుణ్యక్షేత్రాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు అభివర్ణించారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా పీటీఏం 2.0 సమావేశానికి విద్య శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతోకొంత చేయూత ఇవ్వాలని పిలుపు నిచ్చారు. విద్యా వ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి లోకేష్‌ను ఈ సందర్భంగా అభినందించారు. ఎవరినైనా మరిచిపోతాం కానీ టీచర్లను మరిచిపోలేమన్నారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదని గుర్తు చేశారు. లోకేష్ చదువుకునే రోజుల్లో తాను ఎప్పుడూ పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్లలేకపోయానని.. అంతా భువనేశ్వరినే చూసుకునే వారని సీఎంచంద్రబాబు తెలిపారు.
తన టీచర్‌ను తానెప్పుడు మరిచి పోలేదన్నారు. ఆడ బిడ్డల కోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు.
చదువు విషయంలో మహిళలకు పెద్ద పీట వేశానని చెప్పారు.
ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం పథకం ద్వారా నగదు ఇచ్చే బాధ్యత తనదన్నారు.
విద్యా శాఖను నారా లోకేష్ ఏరికోరి మనస్ఫూర్తిగా తీసుకున్నారన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో నో వేకెన్సీ అని బోర్డులు పెట్టారు. ఇది చాలా సంతోషంగా అనిపించిందన్నారు. ఇది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనపడాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
లీప్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎవరైనా స్కూల్‌కు విద్యార్థులు డుమ్మా కొడితే ఉదయం 10.30 గంటలకు పేరెంట్స్‌కు సందేశం వెళ్తుందన్నారు.
లీప్ యాప్‌ను రూపొందించిన మంత్రి నారా లోకేష్‌నుఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అభినందించారు.
పిల్లల స్కూల్ బ్యాగులపై గత ప్రభుత్వ హయాంలో బొమ్మలు వేశారని.. బడులలో రాజకీయాలకు తావు లేదని సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.
గత ప్రభుత్వం స్కూళ్లలో మధ్యాహ్నం భోజన పథకాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు.
తన విద్యార్ధి దశలో అన్నం పొట్లం కట్టుకొని వాగులు వంకలు దాటుకొని స్కూల్‌కి నడిచి వెళ్లే వాడిని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. సన్న బియ్యంతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు.
ఎవరైనా గంజాయి సాగు చేసినా అమ్మినా.. అదే వారికి చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. గంజాయికి దూరం కాకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామన్నారు.
తల్లి పట్ల భక్తి భావం పెరగాలని అందుకే తల్లికి వందనం పేరు పెట్టానన్నారు. గత ప్రభుత్వం ఒక్క టీచర్‌ను నియమించ లేదని.. బాత్రూమ్‌లో ఫోటోలు తీసి యాప్‌లో అప్ లోడ్ చేసి వేధింపులకు గురి చేశారని.. వాటిని రద్దు చేశామని సీఎం చంద్రబాబు వివరించారు.
పిల్లలకు ఎకరా రెండు ఎకరాలు ఆస్తి ఇవ్వడం కాదు. బాగా చదివిస్తే కుటుంబం, సమాజం బాగుపడుతుందని తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.
Updated Date - Jul 10 , 2025 | 10:04 PM