US Trucker Visa Freeze: వలసలపై ఉక్కు పాదం.. వారికి వీసాల జారీని తక్షణం నిలిపివేస్తున్నట్టు ట్రంప్ సర్కార్ ప్రకటన
ABN, Publish Date - Aug 22 , 2025 | 10:28 AM
ట్రక్ డ్రైవర్‌లకు వర్కర్ వీసాల జారీని నిలిపివేస్తున్నట్టు ట్రంప్ సర్కారు తాజాగా ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు, అమెరికన్ల ఉపాధిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ ట్రక్ డ్రైవర్ వర్కర్ వీసా జారీని తక్షణం నిలివేస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తాజాగా పోస్టు పెట్టారు. ‘అమెరికా రోడ్లపై విదేశీ డ్రైవర్‌లు భారీ ట్రక్కులు డ్రైవ్ చేస్తుండటంతో అమెరికన్లకు ప్రమాదకరంగా మారుతోంది. అమెరికన్ల ఉపాధిపై దెబ్బకొడుతోంది’ అని మార్కో రూబియో ఓ ప్రకటనలో తెలిపారు. కమర్షియల్ ట్రక్ డ్రైవర్‌లకు వర్కర్ వీసాల జారీని తక్షణం నిలిపివేస్తున్నట్టు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
విదేశీ కమర్షియల్ ట్రక్ డ్రైవర్‌ల విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్‌లో ఆదేశించిన విషయం తెలిసిందే. కమర్షియల్ వాహనాల డ్రైవర్‌లకు ఆంగ్లభాషా నైపుణ్యం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆంగ్లంపై పట్టులేనంత మాత్రాన లైసెన్స్‌ను నిరాకరించరాదంటూ 2016లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ట్రంప్ పక్కకు పెడుతూ తాజా ఆదేశాలను జారీ చేశారు.
ఫ్లోరిడాలో ఇటీవల హర్జీందర్ సింగ్ అనే ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశం అమెరికాలో ప్రకంపనలు సృష్టించింది. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్టు ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రెటరీ షాన్ డఫ్పీ పేర్కొన్నారు. హర్జీందర్ సింగ్‌కు ఇంగ్లిష్ సరిగా రాదని, అతడికి అమెరికాలో పనిచేసేందుకు చట్టపరమైన అనుమతులు కూడా లేవని పేర్కొన్నారు. అధికారిక అవసరాల కోసం వినియోగించే మార్గంలో యూటర్న్ తీసుకున్న సమయంలో అతడి ట్రక్‌ను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన అధికారులు విచారణ కోసం అతడిని ఫ్లోరిడాకు పంపించారు. డ్రైవర్‌ల విషయంలో సరైన నిబంధనలు అమలు చేయని పక్షంలో యాక్సిడెంట్స్ ముప్పు పెరుగుతుందని ఈ సందర్భంగా డఫ్పీ హెచ్చరించారు. ఇక అమెరికాలో ఇప్పటికే ఉంటున్న 55 మిలియన్‌ల మంది వీసాలను కూడా సమీక్షించేందుకు ట్రంప్ సర్కారు తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
ట్రంప్ సర్కార్ మరో నిర్ణయం.. విదేశీయులకు మళ్లీ మొదలైన టెన్షన్
వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి.. 6 వేల వీసాల రద్దు
Updated Date - Aug 22 , 2025 | 10:41 AM