US Visa Vetting: ట్రంప్ సర్కార్ మరో నిర్ణయం.. విదేశీయులకు మళ్లీ మొదలైన టెన్షన్
ABN , Publish Date - Aug 22 , 2025 | 08:29 AM
వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 55 వీసాదారులపై నజర్ పెట్టింది. వారి వివరాలను సమీక్షిస్తున్నట్టు పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: వలసలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని 55 విసాదారుల వివరాలను సమీక్షిస్తామని గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలిస్తే డిపోర్టు చేసే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ‘వీసా గడువుకు మించి అమెరికాలో ఉన్నా, క్రిమినల్ చర్యలకు దిగినా, ప్రజాభద్రతకు ముప్పుగా మారినా, ఎలాంటి ఉగ్రకార్యకలాపాలకు పాల్పడినా విదేశీయులను వెనక్కు పంపించేస్తామని విదేశాంగ శాఖ పేర్కొందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు ఏ రకమైన సహాయం అందించినా వీసా రద్దు చేసి వెనక్కు పంపించేస్తామని అన్నారు.
ఇక ఇటీవల అమెరికాలో చేపట్టిన వీసా సమీక్షల్లో ఇదే అతి పెద్దదని తెలుస్తోంది. టూరిస్టులు, విద్యార్థులు, ఎక్సేంజ్ వీసాదారులు వంటి వివిధ వర్గాలపై ప్రభుత్వ చర్యలు ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చట్టప్రకారం ఈ సమీక్షలు జరుగుతాయా లేదా అని వలసదారుల హక్కుల సంస్థలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
‘ఈ ప్రక్రియలో భాగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్నంతా సమీక్షిస్తాం. ఇమిగ్రేషన్ రికార్డులు, పోలీసు శాఖ సమాచారం, ఇతరత్రా విషయాలను పరిశీలిస్తాం’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ మొత్తం 6 వేల వీసాలను రద్దు చేసినట్టు అమెరికా ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. వీసా గడువు ముగిసినా దేశాన్ని వీడకపోవడం, నేరాలకు పాల్పడటం, మద్యం మత్తులో డ్రైవింగ్, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు దిగిన వారి వీసాలను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. ఉగ్రవాదానికి మద్దుతు ఇచ్చిన కారణంగా సుమారు 200 నుంచి 300 మంది వీసాలను రద్దు చేసినట్టు కూడా పేర్కొంది.
ఇప్పటికే ట్రంప్ సర్కారు వీసాల జారీని కఠినతరం చేసిన విషయం తెలిసిందే. వీసా దరఖాస్తుదారులందరూ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని పేర్కొంది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన అనేక మినహాయింపులను రద్దు చేసింది. అభ్యర్థుల సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించాకే వీసాలు జారీ చేయాలని వివిధ దేశాల్లోని కాన్సులేట్, రాయబార కార్యాలయాలను ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
భారతీయ ట్రక్ డ్రైవర్ నిర్వాకం.. రోడ్డు ప్రమాదంపై ట్రంప్ ప్రభుత్వం ఫైర్
వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి.. 6 వేల వీసాల రద్దు