Share News

Florida Truck Crash: భారతీయ ట్రక్ డ్రైవర్ నిర్వాకం.. రోడ్డు ప్రమాదంపై ట్రంప్ ప్రభుత్వం ఫైర్

ABN , Publish Date - Aug 19 , 2025 | 10:14 AM

ఫ్లోరిడాలో భారతీయుడి నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఓ యాక్సిడెంట్ రాజకీయ దుమారం రేపుతోంది. కాలిఫోర్నియా గవర్నర్, ట్రంప్ ప్రభుత్వం మధ్య పరస్పర ఆరోపణల పర్వానికి దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది.

Florida Truck Crash: భారతీయ ట్రక్ డ్రైవర్ నిర్వాకం.. రోడ్డు ప్రమాదంపై ట్రంప్ ప్రభుత్వం ఫైర్
Harjinder Singh Florida Crash

ఇంటర్నెట్ డెస్క్: ఓ భారతీయ ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్లోరిడా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. అక్రమ వలసల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. సెమీ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న హర్జీందర్ సింగ్ నిర్లక్ష్యం కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. హైవేపై హర్జీందర్ తప్పుడు యూటర్న్ తీసుకోవడంతో అతడి లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఎక్స్ వేదికగా పంచుకుంది.

ఈ ఉదంతంపై ట్రంప్ ప్రభుత్వం కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్‌‌ను టార్గెట్ చేసింది. ఈ అక్రమవలసదారుడికి కాలిఫోర్నియా రోడ్డు రవాణా శాఖ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిందని పేర్కొంది. ‘ఇంకెంత మంది అమాయకులు చనిపోవాలి.. మార్పు ఎప్పుడు వస్తుంది’ అని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రశ్నించింది.

ఇదిలా ఉంటే ట్రంప్ ప్రభుత్వ ఆరోపణలను కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం కొట్టి పారేసింది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న తరుణంలోనే సింగ్ అమెరికాలోకి ప్రవేశించాడని పేర్కొంది. అప్పటికి న్యూసమ్ ఇంకా గవర్నర్ పదవిని చేపట్టలేదని పేర్కొంది. కాలిఫోర్నియా రాష్ట్ర నిబంధనల ప్రకారం దేశంలో చట్టబద్ధంగా ఉంటున్న వారికి డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తారని వెల్లడించింది.


అమెరికా మీడియా కథనాల ప్రకారం, హర్జీందర్ సింగ్ 2018 సెప్టెంబర్‌లో అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా కాలిఫోర్నియా సరిహద్దు గస్తీ పోలీసులకు చిక్కాడు. అతడిని తిరిగి పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, స్వదేశానికి వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేయడం, వెళ్లాలంటే భయమేస్తోందని పేర్కొనడంతో అతడిని 5 వేల డాలర్ల ఇమిగ్రేషన్ బాండ్‌పై విడుదల చేశారు. నాటి నుంచీ అతడు అమెరికాలో ఇమిగ్రేషన్ శాఖ పర్యవేక్షణలో ఉంటున్నాడు.

‘అక్రమంగా వచ్చిన ఇతడు ఓ భారతీయుడు. ఇతడికి కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం కమర్షియల్ డ్రైవర్ లైసెన్స్ జారీ చేసింది. ఇలాంటి నిర్లక్ష్య పూరిత విధానం వల్ల అమెరికా పౌరులు ప్రమాదంలో పడుతున్నారు. చేసిన తప్పును అంగీకరించే బదులు గవర్నర్ తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ వలసదారులకు లైసెన్స్ జారీ చేస్తే ప్రజాభద్రత పెరుగుతుందని చెప్పుకుంటున్నారు’ అని వైట్ హౌస్ ఓ ప్రకటనలో మండిపడింది.


ఈ వార్తలు కూడా చదవండి:

తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఎడారి జలవనరుల విధాన పరిశీలనకు రండి.. ఏపీ మంత్రికి ఎన్నారై ఆహ్వానం

Read Latest and NRI News

Updated Date - Aug 19 , 2025 | 10:25 AM