NRI: ఎడారి జలవనరుల విధాన పరిశీలనకు రండి.. ఏపీ మంత్రికి ఎన్నారై ఆహ్వానం
ABN , Publish Date - Aug 11 , 2025 | 08:18 PM
ఎడారిలో జన వనరుల విధాన పరిశీలనకు రావాలంటూ ఏపీ మంత్రి నిమ్మకాయల రామనాయుడును సౌదీ ఎన్నారై ప్రముఖుడు మల్లేశన్ ఆహ్వానించారు. మంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు ఆహ్వానించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గలగల పారే జీవ నదులు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు ఏ రకమైన నిరంతర జల ప్రవాహం లేని ఎడారి దేశాలలో ఆనకట్టల నిర్మాణం, నిర్వహణ వ్యవస్థను ఒక సారి అధ్యయనం చేయాలని సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా అధ్యక్షుడు కె.వి. మల్లేశన్ ఏపీ రాష్ట్ర మంత్రి నిమ్మకాయల రామ నాయుడుకు విజ్ఞప్తి చేసారు.
ఈ మేరకు ఆయన మంత్రిని పాలకొల్లులోని ఆయన నివాసంలో ఆదివారం కుటుంబ సమేతంగా కలిసి ఆహ్వానించినట్లుగా తెలిపారు. జల వనరుల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు సౌదీ అరేబియాలో తాను పని చేసే జిజాన్ ప్రాంతంలో, జిజాన్ సమీపంలోని బిషా ప్రాంతాలలోని ఆనకట్టలు, వాటి పరీవాహక ప్రాంతాలలో భూగర్భ జలాల అభివృద్ధిని అధ్యయనం చేయడానికి సౌదీ అరేబియా రావాల్సిందిగా మల్లేశన్ మంత్రిని ఆహ్వానించారు.
తమ సంఘం సాటా కార్యకలాపాల గూరించి కూడా మంత్రి రామ నాయుడుకు వివరించానని ఆయన చెప్పారు. పాలకొల్లు ప్రాంతానికి చెందిన మల్లేశన్ గల్ఫ్ దేశాలలో పెద్ద సంఖ్యలో పాలకొల్లు ప్రవాసీయులు ఉన్న విషయాన్ని కూడా మంత్రికి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఫ్రిస్కో హనుమాన్ ఆలయంలో కొలువైన శ్రీవారు
పీ-4 పథకానికి ప్రవాసీయులు ముందుకు రావాలి: చంద్రబాబు