London Arson Attack: లండన్‌లో భారతీయ రెస్టారెంట్‌కు నిప్పు పెట్టిన దుండగులు.. షాకింగ్ దృశ్యాలు వైరల్
ABN, Publish Date - Aug 25 , 2025 | 01:06 PM
శుక్రవారం లండన్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు ఇప్పటికే ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లో భారతీయ రెస్టారెంట్‌కు నిప్పు పెట్టిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డట్టు స్థానిక పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ టీనేజర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. తూర్పు లండన్‌లోని వుడ్‌ఫోర్డ్ ఎవెన్యూలోగల ఇండియన్ అరోమా అనే రెస్టారెంట్‌పై ఈ దాడి జరిగిందని చెప్పారు. దుండగులు రెస్టారెంట్‌లో నిప్పు రాజేస్తున్న ఘటన తాలూకు వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.
గత శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో రెస్టారెంట్ కస్టమర్లతో కిటకిటలాడుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, మాస్కులు ధరించి ముగ్గురు వ్యక్తులు రెస్టారెంట్‌లోపలికి వెళ్లి అక్కడ నేలపై ఏదో ద్రవాన్ని జల్లి ఆపై నిప్పంటించారు. చూస్తుండగానే ఉవ్వెత్తున గది అంతా మంటలు వ్యాపించాయి. దీంతో, ఒక్కసారిగా రెస్టారెంట్‌లో కలకలం రేగింది. సిబ్బంది, కస్టమర్లు ఏం జరుగుతోందో అర్థంకాక బెదిరిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. దుస్తులకు నిప్పంటుకున్న ఓ వ్యక్తి బయటకు పరుగుతీసిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులకు కాలిన గాయాలు అయినట్టు తెలిసింది. సమాచారం అందినే వెంటనే అక్కడకు చేరుకున్న పారామెడికల్ సిబ్బంది బాధితులకు ప్రాథమిక చికిత్స చేశాక సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒక మహిళ, మరో పురుషుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరు కస్టమర్లు.. పారామెడికల్ సిబ్బంది వచ్చే లోపే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. వారు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి ఏకంగా గంటన్నర సమయం పట్టింది. ‘ఒంటికి నిప్పు అంటుకోవడంతో ఓ వ్యక్తి హాహాకారాలు చేస్తూ బయటకు వెళ్లడాన్ని తాను చూశానని మరో కస్టమర్ డీనా మైఖేల్ తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి 15 ఏళ్ల టీనేజర్‌ను, 54 ఏళ్ల పురుషుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరూ నిప్పు రాజేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సెంట్రల్ స్పెషలిస్టు క్రైమ్ విభాగం అధికారి ఒకరు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఓపీటీని ట్రంప్ టార్గెట్ చేయనున్నారా.. విదేశీ విద్యార్థులకు చుక్కలే..
ట్రంప్ సర్కార్ మరో నిర్ణయం.. విదేశీయులకు మళ్లీ మొదలైన టెన్షన్
Updated Date - Aug 25 , 2025 | 01:11 PM