US OPT Program: ఓపీటీని ట్రంప్ టార్గెట్ చేయనున్నారా.. విదేశీ విద్యార్థులకు చుక్కలే..
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:04 AM
అమెరికన్ల ఉపాధి అవకాశాలు పెంచుతానంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థుల ఓపీటీ ప్రోగ్రామ్‌పై కన్నేసింది. ఈ ప్రోగ్రామ్‌ను రద్దు చేయడం, పరిమితులు విధించడం, జీతాలపై పన్నులు తదితర అంశాలపై ట్రంప్ సర్కార్ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆప్షనల్ ప్రాక్టికల్ టెయినింగ్ (ఓపీటీ).. అమెరికాలో పని అనుభవం గడించాలనుకున్న విదేశీ విద్యార్థులకు ఇది ప్రధాన మార్గం. కానీ ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఓపీటీపైనా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గతేడాది సుమారు 2 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఓపీటీతో పని అనుభవం గడించారు. ఓపీటీకి అనుబంధంగా ఉండే స్టెమ్ రంగాల ఎక్స్‌టెన్షన్ కారణంగా మరో 95 వేల మంది ప్రయోజనం పొందారు. కానీ, ట్రంప్ సర్కారు తాజా చర్యలతో ఈ అవకాశాలూ త్వరలో కనుమరుగు కానున్నాయన్న భయాందోళనలు మొదలయ్యాయి.
ఓపీటీ కారణంగా అమెరికా వర్కర్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని ట్రంప్ సర్కారులోని కీలక వ్యక్తులు భావిస్తున్నారు. దీన్ని మొత్తంగా రద్దు చేయాలని కూడా కొందరు ప్రతిపాదిస్తున్నారు. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్‌లోని పాలసీ స్టడీస్ విభాగం డైరెక్టర్ జెసీకా వాన్ ఓపీటీని రద్దు చేయాలని ఇటీవల అమెరికా ఉభయ చట్టసభలను కోరారు. కనీసం ఈ పథకంపై పరిమితులనేనా విధించాలని అభ్యర్థించారు. త్వరలో అమెరికా వలసల శాఖ బాధ్యతలు చేపట్టనున్న జోసెఫ్ ఎడ్లో కూడా ఈ విషయంలో సంచలన కామెంట్ చేశారు. ఎఫ్-1 వీసా స్టూడెంట్స్‌కు చదువు తరువాత అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అనుమతించొద్దని వాదించారు. ఇది అమెరికా వలసల చట్టం స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దీంతో, ఆయన వలసల శాఖ బాధ్యతలు చేపట్టాక ఓపీటీని కచ్చితంగా టార్గెట్ చేసుకుంటారన్న భయాలు మొదలయ్యాయి.
ఇది చాలదన్నట్టు కొందరు అమెరికా చట్టసభ సభ్యులు కూడా ఓపీటీని టార్గెట్ చేశారు. ఓపీటీ ప్రోగ్రామ్‌కు ఇచ్చి పన్ను మినహాయింపును రద్దు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే ఒక్కో విదేశీ విద్యార్థిపైనా కనీసం 15.3 శాతం వరకూ పన్ను భారం పడే అవకాశం ఉందని అక్కడి నిపుణులు కామెంట్ చేస్తున్నారు. సోషల్ సెక్యూరిటీ పన్ను కింద విద్యార్థి నుంచి 6.2 శాతం, అతడి సంస్థ నుంచి మరో 6.2 శాతం, మెడికేర్ కోసం మరో 1.45 శాతం జీతంలో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న జీతాల్లో ఇలాంటి కోతలు విధిస్తే విద్యార్థులకు చుక్కలు కనిపిస్తాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఓపీటీపై ఉద్యోగం చేస్తున్న వారిని అమెరికా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు హడలెత్తిస్తున్నారు. తమ ఉద్యోగ రికార్డులను ఎస్‌ఈవీఐఎస్ సిస్టమ్‌లో అప్‌డేట్ చేసుకోని వారికి వార్నింగ్స్ జారీ చేశారు. జాబ్ వెరిఫికేషన్‌కు సంబంధించి 90 రోజుల పాటు ఎలాంటి అప్‌డేట్స్ లేకపోతే డిపోర్టేషన్ కార్యాచరణ మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వీసా కోల్పోకూడదంటే ఈ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు, ఓపీటీ స్టూడెంట్స్‌కు జాబ్ లేకపోయినా నకిలీ పే స్లిప్స్ జారీ చేస్తున్న కంపెనీలపై కూడా ఐసీఈ అధికారులు దృష్టి సారించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
న్యూయార్క్ రోడ్డు ప్రమాదం.. మృతుల్లో భారతీయుడు ఉన్నట్టు పోలీసుల వెల్లడి
ట్రంప్ సర్కార్ మరో నిర్ణయం.. విదేశీయులకు మళ్లీ మొదలైన టెన్షన్