Destinations on Majestic Rail Routes: చలికాలం చక్కర్లు కొట్టేద్దాం
ABN, Publish Date - Oct 26 , 2025 | 02:43 AM
ఈ శీతాకాలం అందమైన రైలు ప్రయాణ అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మనోహరమైన ప్రకృతి దృశ్యాల గుండా సాగే ఈ రైలు ప్రయాణాలను ఎంచుకోండి. చలికాలం వాతావరణం ప్రయాణాలకూ, వినోదాలకూ...
ఈ శీతాకాలం అందమైన రైలు ప్రయాణ అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మనోహరమైన ప్రకృతి దృశ్యాల గుండా సాగే ఈ రైలు ప్రయాణాలను ఎంచుకోండి. చలికాలం వాతావరణం ప్రయాణాలకూ, వినోదాలకూ ఎంతో అనుకూలంగా ఉంటుంది. పైగా ఈ కాలంలో పర్వత ప్రాంతాల ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. మంచు కప్పేసిన పర్వతాలు, దట్టమైన అడవులు, పారే సెలయేర్లు... ఇలాంటి అద్భుతమైన ప్రకృతి అందాలను వీక్షిస్తూ వాటి గుండా రైల్లో ప్రయాణించే అనుభవాన్ని పొందడం కోసం ఇవిగో ఈ రైలు ప్రయాణాలను ఎంచుకోవచ్చు.
కల్కా - శిమ్లా (హిమాచల్‌ప్రదేశ్)
కల్కా-శిమ్లా రైల్వే స్టేషన్... నిర్మాణ కౌశలానికి గాను 2008లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. 1903లో బ్రిటిషర్లు నిర్మించిన కల్కా-శిమ్లా రైల్వే మార్గం అద్భుతమైన ప్రకృతిదృశ్యాలకు పేరు పొందింది. మంచు పర్వతాల గుండా 900 వంతెనలు, వెయ్యి సొరంగాల మీదుగా సాగే ఈ రైలు ప్రయాణం అసాంతం అద్భుతమైన ప్రకృతిదృశ్యాలు మనల్ని కనువిందు చేస్తాయి. నాలుగు నుంచి ఐదు గంటల పాటు సాగే ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
డార్జిలింగ్ - హిమాలయన్ రైల్వే (పశ్చిమ బెంగాల్)
డార్జిలింగ్, హిమాలయన్ టాయ్ ట్రైన్ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. 1879 నుంచి 1881 మధ్య కాలంలో నిర్మించిన ఈ రైల్వే లైన్, కొత్త జల్పాయ్‌గురి, డార్జిలింగ్‌ల మధ్య నడుస్తూ ఉంటుంది. ఈ రైలు మార్గం అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్, ఘుమ్ మీదుగా ప్రయాణిస్తుంది. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఈ మార్గంలో ప్రయాణించగలిగితే, మనోహరమైన పర్వత దృశ్యాలను వీక్షించే అవకాశం దక్కుతుంది. ఈ నెలల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు, రైల్లో నుంచి హిమాలయాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.
జమ్ము - బారాముల్లా లైన్
కశ్మీర్ శీతాకాలపు భూతలస్వర్గం. కశ్మీరు అందాలను పూర్తి స్థాయిలో వీక్షించాలనుకునేవాళ్లు ఈ రైలు ప్రయాణాన్ని తప్పక ఎంచుకోవాలి. ఈ 324 కిలోమీటర్ల ప్రయాణంలో, మంచు కప్పేసిన పర్వతాలు, అందమైన నదులు కనువిందు చేస్తాయి. అలాగే ప్రపంచంలోనే అత్యంత పొడవాటి చీనాబ్ వంతెన మీదుగా ప్రయాణించే అవకాశం కూడా దక్కుతుంది. బనిహాల్ నుంచి సంగల్డన్ వరకూ సాగే భారతదేశంలోని అతి పొడవాటి సొరంగం కూడా ఈ దారిలోనే ఉంటుంది. కొత్తగా వాడుకలోకి వచ్చిన ఈ రైలు మార్గం ప్రయాణికులకు ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది.
నీలగిరి మౌంటెన్ రైల్వే
నీలగిరి మౌంటెన్ రైల్వే కూడా మరొక యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదే! మెట్టుపాళ్యం నుంచి ఊటీ వరకూ ప్రయాణించే ఈ రైలు మార్గాన్ని 1908లో బ్రిటిషర్లు నిర్మించారు. అందమైన ప్రకృతిదృశ్యాల గుండా సాగే ఈ రైలు పాతకాలపు ఆవిరి ఇంజన్‌తో నడుస్తుంది. పిల్లలూ, పెద్దలూ, ప్రకృతి ప్రేమికులు, చరిత్ర పట్ల ఆసక్తికలిగిన వారు... ఇలా ఈ రైలు ప్రయాణం ప్రతి ఒక్కర్నీ అందర్నీ అలరిస్తుంది. నీలగిరి కొండల అందాలను ఆస్వాదించాలనుకునేవారు ఈ రైలు ప్రయాణాన్ని మిస్ చేసుకోకూడదు.
ప్యాలెస్ ఆన్ వీల్స్
(రాజస్థాన్)
అత్యంత విలాసవంతమైన రైలు ప్రయాణాన్ని కోరుకునేవాళ్లు ప్యాలెస్ ఆన్ వీల్స్‌ను తప్పక ఎంచుకోవాలి. ఈ విలావంతమైన రైలు ఏడు రాత్రుళ్లు, 8 పగళ్లు నిరాటంకంగా ప్రయాణిస్తుంది. రాజస్థాన్ నుంచి ఆగ్రా వరకూ నడిచే ఈ రైలును 1982లో లాంచ్ చేశారు. కళ్లుచెదిరే ఇంటీరియర్స్, అద్భుతమైన భోజనం, ఆతిథ్యం.. ఇలా ఈ రైల్లో విలాసాలకు ఏమాత్రం కొదవ ఉండదు. ఈ రైలు ప్రతి సంవత్సరం, సెప్టెంబరు నుంచి ఏప్రిల్ వరకూ నడుస్తుంది. ప్రధాన నగరాలైన ఢిల్లీ, జైపూర్, చిత్తోర్‌ఘడ్, ఉదయ్‌పూర్, ఆగ్రాల మీదుగా ప్రయాణిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 26 , 2025 | 02:44 AM