Storytelling For Kids: కథలు చెబుతున్నారా
ABN, Publish Date - Jul 21 , 2025 | 02:09 AM
తల్లిదండ్రులు రోజూ కథలు చెబుతూ ఉంటే పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఇలా రోజూ కథలు వినడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాల...
తల్లిదండ్రులు రోజూ కథలు చెబుతూ ఉంటే పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఇలా రోజూ కథలు వినడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
కథ వింటూ పిల్లలు ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. కథలో లీనమై జరగబోయేదాన్ని ముందుగానే ఊహిస్తూ ఉంటారు. దీనివల్ల వారిలో ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగుతాయి.
కథల్లోని పాత్రలకు ఎదురయ్యే కష్టాలు, వాటి నుంచి బయట పడిన విధానాలు.... పిల్లలను అమితంగా ఆకర్షిస్తాయి. వీటిని బాగా గుర్తుపెట్టుకుంటారు కూడా. దీంతో పిల్లలు స్వయంగా సమస్యలను పరిష్కరించుకోవడం ఎలాగో నేర్చుకుంటారు.
ముఖంలో భావాలను పలికిస్తూ కథ చెబుతూ ఉంటే పిల్లలు శ్రద్దగా వింటారు. ధ్యాస మొత్తాన్ని కథపైనే ఉంచుతారు. దీనివల్ల పిల్లల్లో ఏకాగ్రత, కుదురు పెరుగుతాయి.
కథలోని పాత్రల పేర్లు, ఊళ్ల గురించి పిల్లలు సందేహాలు అడుగుతూ ఉంటారు. అప్పటి జీవన విధానం, వృత్తులు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణలపై ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వీటి గురించి ఎప్పటికప్పుడు వివరంగా చెబుతూ ఉంటే భాషకు సంబంధించిన ఎన్నో పదాలను పిల్లలు తెలుసుకుంటారు.
తరచూ చందమామ కథలు, కాశీ మజిలీ కథలు చెబుతూ ఉంటే...... సమాజం, కట్టుబాట్లు, క్షమ, దయ, నైతిక విలువల గురించి పిల్లలకు అర్థమవుతుంది. మంచి, చెడుల తారతమ్యాన్ని ఆలోచించడం మొదలుపెడతారు.
పిల్లలు సాధారణంగా వినడం కంటే మాట్లాడడం మీదే దృష్టి పెడుతూ ఉంటారు. వీళ్ల దృష్టిని మరల్చే విధంగా కథ చెబితే క్రమంగా వినడం అలవాటు చేసుకుంటారు. అలాగే తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను కూడా శ్రద్దగా వినగల్గుతారు.
కథలు వినడం వల్ల పిల్లలకు లోకజ్ఞానం తెలుస్తుంది. నీతి, అవినీతి గురించి అవగాహన ఏర్పడుతుంది. సమాజంలో మెలగాల్సిన తీరు అర్థమవుతుంది. భావోద్వేగాలు పరిచయమవుతాయి. సొంతంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది.
కథలు వింటూ ఉంటే పిల్లలకు చదవాలనే ఆసక్తి కలుగుతుంది. కథల పుస్తకాలు తీసుకుని సొంతంగా చదవడం ప్రారంభిస్తారు. దీంతో పిల్లలకు పుస్తక పఠనం అలవడుతుంది.
ఇవీ చదవండి:
జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్
22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..
Updated Date - Jul 21 , 2025 | 02:09 AM